Bhavika Mangalanandan: ఐక్యరాజ్యసమితి (UN) వేదికగా భారత్‌పై మరోసారి విషం కక్కేందుకు ప్రయత్నించిన దాయాది దేశం పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగిన ‘అసాధారణ పరిస్థితులలో అంత్యక్రియల హక్కులు, మత విశ్వాసాలు’ అనే అంశంపై నిర్వహించిన చర్చా వేదికలో భారత శాశ్వత మిషన్ తొలి కార్యదర్శి భావికా మంగళానందన్ పాకిస్థాన్ ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టారు. జమ్మూకశ్మీర్‌లోని భద్రతా చర్యలు, మైనార్టీల హక్కుల గురించి మాట్లాడే నైతిక అర్హత పాక్‌కు ఏమాత్రం లేదని ఆమె స్పష్టం చేశారు.
కార్గిల్ యుద్ధం నాటి చరిత్రను గుర్తు చేసిన భారత్
ఐరాసలో పాక్ తీరును తీవ్రంగా ఎండగడుతూ.. 1999 కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన తమ సొంత దేశ సైనికుల మృతదేహాలను కూడా స్వీకరించడానికి నిరాకరించిన దేశం, ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై మత స్వేచ్ఛ, ఖనన హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని భావికా మంగళానందన్ చురకలంటించారు. ఆ సమయంలో యుద్ధంలో మరణించిన పాకిస్థానీ జవాన్ల భౌతికకాయాలకు భారత సైన్యమే మానవతా దృక్పథంతో పూర్తి సైనిక లాంఛనాలతో, ఇస్లామిక్ సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించిన చరిత్రను ఆమె గుర్తు చేశారు.
ఉగ్రవాదుల హక్కులపై పాక్ మొసలి కన్నీరు
కశ్మీర్లో భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియల హక్కుల గురించి ప్రత్యేక నివేదికలో ఆందోళన వ్యక్తం చేయడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉగ్రవాది అనేవాడు అమాయక ప్రజల ప్రాణాలను తీయడమే కాకుండా, ఒక దేశ భద్రతను, ప్రజల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తాడని భారత్ స్పష్టం చేసింది. జీవించే హక్కును కాలరాసే ముష్కరుల హక్కుల గురించి పరితపించే వారు, ఉగ్రవాద బాధితుల హక్కుల గురించి ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆమె నిలదీశారు. అంతర్జాతీయ నివేదికలు కొన్నేళ్ల పాత అంశాలను తవ్వి తీస్తూ, కేవలం గ్లోబల్ సౌత్ దేశాలనే లక్ష్యంగా చేసుకోవడం సరైన విధానం కాదని హితవు పలికారు.
పీవోకే అరాచకాలపై దృష్టి పెట్టండి
భారత భూభాగమైన జమ్మూకశ్మీర్ అంతర్గత వ్యవహారాలపై అనవసరంగా దృష్టి పెట్టే బదులు, తమ అక్రమ ఆక్రమణలో ఉన్న రావల్కోట్ వంటి ప్రాంతాల్లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలపై పాకిస్థాన్ శ్రద్ధ పెట్టాలని భారత్ హితవు పలికింది. పాక్‌లో మైనార్టీల జనాభా నానాటికీ పడిపోతోందని, వారి ప్రాథమిక హక్కులను నిరంతరం కాలరాస్తున్న ఒక దేశానికి భారత్‌కు నీతులు చెప్పే హక్కు లేదని తేల్చిచెప్పారు.
ఐక్యరాజ్యసమితి వేదికగా జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్‌కు భారత్ దీటుగా బదులిచ్చింది. కార్గిల్ అమరులైన సొంత సైనికుల మృతదేహాలనే తీసుకోని పాక్, మత విశ్వాసాలు, ఉగ్రవాదుల అంత్యక్రియల హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని భారత ప్రతినిధి భావికా మంగళానందన్ చురకలంటించారు.
