Life Style: ఆరోగ్యానికి ఎంతో మంచిదని భావించే దేశీ నెయ్యి ఎక్కువగా తింటే పిత్తాశయం(Gallstones)లో రాళ్లు (గాల్ బ్లాడర్ స్టోన్స్) ఏర్పడతాయా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. నెయ్యిలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం, మరోవైపు గాల్ బ్లాడర్ రాళ్లు కూడా ఎక్కువగా కొలెస్ట్రాల్‌తోనే తయారవుతుండటంతో ఈ అనుమానాలు వస్తుంటాయి. అసలు దేశీ నెయ్యికి, పిత్తాశయ రాళ్లకు సంబంధం ఏమిటో గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు వివరంగా విశ్లేషించారు.
నెయ్యి తింటే నేరుగా రాళ్లు తయారవుతాయా?
నెయ్యి తినడం వల్లే నేరుగా పిత్తాశయంలో రాళ్లు ఏర్పడతాయని చెప్పలేం. బైల్ జ్యూస్ (పిత్త రసం) లోని రసాయనాల సమతుల్యత దెబ్బతిన్నప్పుడే ఈ రాళ్లు తయారవుతాయి. అయితే దేశీ నెయ్యిలో శాచురేటెడ్ ఫ్యాట్, క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఎక్కువ కాలం పాటు పరిమితికి మించి కొవ్వులు, క్యాలరీలు తీసుకుంటే బరువు పెరగడంతో పాటు రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి నెయ్యి మాత్రమే కారణం కాకపోయినా, అతిగా తినడం ప్రమాదకరమే.
ఇప్పటికే రాళ్లు ఉంటే నెయ్యి తింటే ఏమవుతుంది?
ఇప్పటికే గాల్ బ్లాడర్‌లో చిన్న రాళ్లు ఉన్నవారికి నెయ్యి లాంటి హై-ఫ్యాట్ పదార్థాలు తిన్నప్పుడు తీవ్ర సమస్యలు వస్తాయి. మనం కొవ్వు పదార్థాలు తిన్నప్పుడు వాటిని అరిగించడానికి గాల్ బ్లాడర్ సంకోచించి, పిత్త రసాన్ని బయటకు పంపుతుంది. ఆ సమయంలో లోపల ఉన్న రాయి కదిలి నాళాల (పైపుల) దారిని అడ్డుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల అకస్మాత్తుగా తీవ్రమైన కడుపునొప్పి (Gallbladder attack) వస్తుంది.
సర్ గంగారామ్ ఆసుపత్రి నిపుణులు డాక్టర్ అనిల్ అరోరా ప్రకారం.. గాల్ బ్లాడర్ సమస్య మెటబాలిక్ లోపాల వల్ల వస్తుంది. రాయి ఏర్పడిన తర్వాత నెయ్యి ఎక్కువగా తీసుకుంటే లక్షణాలు, నొప్పి తీవ్రత మరింత పెరుగుతాయి.
కనిపించే ముఖ్య లక్షణాలు – ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి?
ఈ క్రింది లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి..
-
కడుపులో కుడివైపు పైభాగంలో విపరీతమైన నొప్పి రావడం.
-
ఆ నొప్పి వెన్నుముక లేదా కుడి భుజం వరకు పాకడం.
-
జ్వరం రావడం, వణుకు పుట్టడం.
-
మాటిమాటికీ వాంతులు, వికారంగా అనిపించడం.
-
కళ్లు లేదా చర్మం పసుపు రంగులోకి మారడం (కామెర్ల లక్షణాలు).
దేశీ నెయ్యి ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, శారీరక శ్రమ, వయస్సును బట్టి రోజువారీ ఆహారంలో పరిమితంగా మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
