Pawan Kalyan

Pawan Kalyan: 10 రోజుల పాటు ప్రజా ఉద్యమం.. డ్రోన్ల ద్వారా విత్తన బంతుల చల్లింపు!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌ను హరితవనంగా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులోని ‘బటర్‌ఫ్లై పార్క్’ (Butterfly Park) ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, చిన్నారులతో కలిసి పవన్ కల్యాణ్ స్వయంగా విత్తన బంతుల (Seed Balls) తయారీ కార్యక్రమంలో పాల్గొని, ఈ బృహత్తర సామాజిక ఉద్యమానికి అధికారికంగా శ్రీకారం చుట్టారు.

అమ్మ పేరిట మొక్కలు.. కొండపల్లి కళాకారులకు అండ!

గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘ఏక్ పేడ్ మాకే నామ్’ (తల్లి పేరిట ఒక చెట్టు) థీమ్‌ను పవన్ కల్యాణ్ కొనియాడారు. “మనకు జన్మనిచ్చిన తల్లి జీవం పోస్తే.. మనం నాటే చెట్టు ఆ జీవాన్ని కాపాడుతుంది. అందుకే ఈ రోజున నాకు జన్మనిచ్చిన మా అమ్మగారు శ్రీమతి అంజనాదేవి గారి పేరిట మూలపాడు బటర్‌ఫ్లై పార్కులో ‘తెల్ల పొనికి’ మొక్కను నాటాను” అని పవన్ కల్యాణ్ భావోద్వేగంగా పంచుకున్నారు.

దీనితో పాటు, ప్రసిద్ధ కొండపల్లి బొమ్మల కళాకారుల జీవనోపాధికి ఉపయోగపడేలా ఒకే చోట ఏకంగా 1000 తెల్ల పొనికి చెట్లను నాటే కార్యక్రమాన్ని చేపట్టడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆయన తెలిపారు.

10 రోజుల పాటు ప్రజా ఉద్యమం.. డ్రోన్ల ద్వారా విత్తన బంతుల చల్లింపు!

పర్యావరణ సమతుల్యత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన మరొక అద్భుత సంకల్పం.. 2.5 కోట్ల విత్తన బంతుల (సీడ్ బాల్స్) తయారీ.

ఈ రోజు (జూన్ 5) నుండి ప్రారంభమై జూన్ 15 వరకు మొత్తం 10 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తముగా అన్ని జిల్లాల్లోని దాదాపు 300 ప్రదేశాలలో ప్రజల భాగస్వామ్యంతో ఈ విత్తన బంతుల తయారీ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతుంది.

ఎర్ర బంకమట్టికి సహజ కంపోస్ట్ ఎరువును జోడించి పూర్తి సేంద్రియ (ఆర్గానిక్) పద్ధతిలో ఈ సీడ్ బాల్స్ తయారు చేస్తున్నారు. ఈ వర్షాకాలంలో వీటిని రాష్ట్రవ్యాప్తంగా చల్లడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.

టెక్నాలజీ వినియోగం..

అడవులు, నదీ తీరాలు, చెరువు గట్లు, కొండ ప్రాంతాలు ఇంకా సాధారణ మనుషులు వెళ్లలేని దుర్ఘట ప్రాంతాలలో సైతం పచ్చదనాన్ని పెంపొందించడానికి అత్యాధునిక డ్రోన్ (Drone) సాంకేతికత సహాయంతో ఈ సీడ్ బాల్స్‌ను వెదజల్లనున్నారు.

ఒక చిన్న సీడ్ బాల్ ఒక పెద్ద వృక్షాన్ని సృష్టించేంత శక్తిని కలిగి ఉంటుంది. ఇవి వాతావరణ మార్పులను అరికట్టి, గాలి నాణ్యతను పెంచుతాయి అలాగే జీవ వైవిధ్యాన్ని (Biodiversity) సంరక్షిస్తాయి.

వివిధ జిల్లాల నుండి చిన్నారులు, అధికారుల భాగస్వామ్యం!

ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల అటవీ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, అక్కడి పురోగతిని తెలుసుకున్నారు:

ఏలూరు డివిజన్ (జంగారెడ్డిగూడెం): ఇక్కడి స్థానిక అడవుల్లో సేకరించిన అల్లనేరేడు, విప్ప, చింత, నెమలి నార, రావి, కానుగ విత్తనాలతో సీడ్ బాల్స్ తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రసిద్ధ పర్యావరణ ప్రేమికుడు ‘వనజీవి రామయ్య’ గారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

తిరుపతి డివిజన్: తిరుపతి ‘విశ్వం స్కూల్’ విద్యార్థులు జస్విత, జస్వంత్ అనే చిన్నారులు పవన్ కల్యాణ్‌తో ముచ్చటించారు. తాము ఉసిరి, వేగ, చింత విత్తనాలతో సీడ్ బాల్స్ తయారు చేశామని, ఇవి గ్రీనరీని పెంచి వేడిని తగ్గిస్తాయని చిన్నారులు ఎంతో ఉత్సాహంగా వివరించగా, డిప్యూటీ సీఎం వారిని అభినందించారు.

అనంతపురం జిల్లా: అనంతపురంలో దాదాపు 600 మంది రైతులు, పురజనులతో కలెక్టర్ స్థానిక అర్బన్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, జిల్లాలో ఒక కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సోషల్ ఫారెస్ట్ డిఎఫ్ఓ గురుప్రభాకర్ వివరించారు.

పరిశ్రమలకు 30% గ్రీన్ బెల్ట్ తప్పనిసరి.. పవన్ కల్యాణ్ ఆదేశం!

అనంతపురం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (PCB) అధికారితో మాట్లాడిన సందర్భంగా పవన్ కల్యాణ్ ఒక కీలక ఆదేశాన్ని జారీ చేశారు. పారిశ్రామిక వాడలలోని ప్రతి పరిశ్రమ కూడా తమ సామాజిక బాధ్యతగా కనీసం 30 శాతం గ్రీన్ బెల్ట్ (పచ్చదనం) ను ఖచ్చితంగా నిర్వహించేలా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని (Enforce) అధికారులను ఆదేశించారు.

అంతరించిపోతున్న సంప్రదాయ కళలకు ‘వుడ్ బ్యాంక్స్’ (Wood Banks)!

పర్యావరణంతో పాటు రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ఉందన్నారు.

కొండపల్లి బొమ్మలకు వాడే తెల్ల పొనికి, ఏటికొప్పాక బొమ్మల తయారీలో వాడే అంకుడు, బొబ్బిలి వీణల తయారీకి ఉపయోగించే పనస కర్రల కొరతను తీర్చడానికి రాబోయే రెండు నెలల్లో ప్రాంతాల వారీగా ప్రత్యేక ‘వుడ్ బ్యాంక్స్’ (Wood Banks) ఏర్పాటు చేయబోతున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు.

మనందరిలో చెట్లు నాటే ఉత్సాహం ఉంది కానీ, వాటిని సంరక్షించడంలో లోపం కనిపిస్తోంది. మనం నాటిన ప్రతి మొక్కను మన ఆధారం లేకుండా అది సొంతంగా ఎదిగే వరకు ఒక బిడ్డలాగా కాపాడుకోవాలి. ఈ ప్రజా ఉద్యమంలో విద్యార్థులు, మహిళలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి” అని కోరుతూ జై భారత్, జై హింద్ నినాదాలతో పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *