Rahul Gandhi: దేశ రాజధాని న్యూఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ‘ఇండియా’ (INDIA) కూటమి చేపట్టిన నిరసన వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. నిరసన సందర్భంగా పోలీసులపై భౌతిక దాడికి పాల్పడ్డారని, విధులకు ఆటంకం కలిగించారనే తీవ్ర అభియోగాలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాలతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు ఏకంగా మూడు ఎఫ్ఐఆర్లు (FIRs) నమోదు చేశారు. పోలీస్ అధికారులను విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడం, ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం వంటి తీవ్ర సెక్షన్ల కింద ఈ కేసులు నమోదైనట్లు పోలీసు వర్గాలు గురువారం వెల్లడించాయి.
బుధవారం నాటి హైడ్రామా – లంచ్ మీటింగ్ నుంచి రోడ్డుపై బైఠాయింపు వరకు..
వరుసగా రెండో రోజు ఎన్నికల సంఘం తీరుకు వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జన్‌పథ్‌లోని సాగర్ రత్న రెస్టారెంట్లో లంచ్ ముగించుకున్న అనంతరం విండ్సర్ ప్యాలెస్ సమీపంలోని ఎలక్షన్ కమిషన్ కార్యాలయం వైపు వెళ్లేందుకు బస్సు ఎక్కిన ఇండియా కూటమి ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసులు బస్సును ముందుకు పోనీయకపోవడంతో రాహుల్, ప్రియాంక గాంధీ సహా ఎంపీలు రోడ్డుపైనే బైఠాయించారు. ప్రియాంక గాంధీ రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని నడిరోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ప్రియాంకను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, రాహుల్ గాంధీ పోలీసులను వెనక్కి నెడుతూ.. ఆమె నా చెల్లెలు.. ముట్టుకోకండి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ తోపులాటలో ప్రియాంక గాంధీ ఒక మహిళా పోలీస్ అధికారిణిని మోచేతితో నెట్టేసినట్లు, మరొక ఆందోళనకారుడు పోలీస్ అధికారి వీపుపై కాలితో తన్నినట్లు ఉన్న వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘర్షణలో అంకిత్ కసానా అనే కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. “విధులు నిర్వర్తించడమే నేను చేసిన తప్పా?” అని సదరు కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
గాయపడ్డ తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా..
ఎంపీలను బలవంతంగా పోలీస్ బస్సుల్లోకి ఎక్కించే క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా చేతులు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తం కారుతున్న చేతులను ఆమె సహచర ఎంపీలకు చూపించారు.
ఈ ఆందోళనలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, ఐయూఎంఎల్ వంటి పలు పార్టీలకు చెందిన ఎంపీలతో పాటు మొత్తం 91 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కేసులు మాకు పతకాలు” – దేశవ్యాప్త నిరసనలకు పిలుపు..
ఇప్పటికే ఆకాశవాణి భవన్ వద్ద ధర్నా చేసినందుకు నమోదైన కేసుపై స్పందిస్తూ.. “నాపై ఇప్పటికే 45 కేసులు ఉన్నాయి, నా టార్గెట్ 100 ఎఫ్ఐఆర్లు చేసుకోవడమే” అని రాహుల్ గాంధీ ఘాటుగా వ్యాఖ్యానించిన మరుసటి రోజే పోలీసులు మరో మూడు కేసులు పెట్టడం గమనార్హం.
మరోవైపు కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ వైఖరిని, ప్రతిపక్షాలపై పోలీసుల దాడులను నిరసిస్తూ గురువారం దేశవ్యాప్తంగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.
