VC.Sajjanar: హైదరాబాద్ నగరంలోని ట్యాంక్‌బండ్‌తో పాటు ప్రధాన రహదారులు, పార్కులు, చెరువుల వద్ద అర్ధరాత్రి వేళల్లో పుట్టినరోజు వేడుకలు, కేక్ కటింగ్‌లు చేయవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ నగర ప్రజలకు, ముఖ్యంగా యువతకు, తల్లిదండ్రులకు అత్యంత తీవ్రమైన విజ్ఞప్తి చేశారు. సంతోషంగా గడపాల్సిన పండుగ లాంటి రోజులు.. క్షణికావేశం, చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలను బలితీసుకుంటూ కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగులుస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘X’ (ట్విట్టర్) వేదికగా ఆయన సుదీర్ఘ పోస్ట్ చేస్తూ ప్రజలను హెచ్చరించారు.
ఆరేళ్ల చిన్నారి బర్త్‌డే నాడే విషాదం – కదిలించిన ఘటన..
రెండు రోజుల క్రితం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ట్యాంక్‌బండ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదాన్ని ప్రస్తావిస్తూ సీపీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు..
పుట్టినరోజే నూరేళ్లు నిండాయి..
ఆరేళ్ల చిన్నారి పుట్టినరోజు సంబరాలు చేసుకునేందుకు కుటుంబ సభ్యులు అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌కు రాగా, మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ పాపతో పాటు కుటుంబ సభ్యుడు కూడా అక్కడికక్కడే దుర్మరణం చెందడం అందరినీ కలిచివేసింది. ఘటన జరిగిన వెంటనే పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని సజ్జనార్ పేర్కొన్నారు.
ట్యాంక్‌బండ్‌పై సమీక్ష – నిబంధనలు గుర్తుచేసిన సీపీ..
భవిష్యత్తులో ఇలాంటి హృదయవిదారక ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి ప్రమాద స్థలాన్ని సీపీ స్వయంగా పరిశీలించారు. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ విభాగాలతో కలిసి సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలను స్పష్టం చేశారు.
-
ఇళ్లలోనే వేడుకలు చేసుకోండి.పుట్టినరోజు అనేది కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత వేడుక. దాన్ని ఇళ్ల వద్ద లేదా ఏదైనా సురక్షితమైన ప్రదేశాల్లో మాత్రమే జరుపుకోవాలి కానీ నడిరోడ్లపైకి రాకూడదు.
-
వేగంగా దూసుకొచ్చే వాహనాలు:అర్ధరాత్రి వేళల్లో రోడ్లపై రద్దీ తక్కువగా ఉండటంతో వాహనాలు అతివేగంతో దూసుకొస్తుంటాయి. అలాంటి ప్రమాదకర సమయంలో చిన్నపిల్లలను తీసుకుని రోడ్లపైకి రావడం ఎంతమాత్రం వివేకం కాదు.
-
ట్యాంక్‌బండ్‌పై వేడుకలు నిషేధం:నిబంధనల ప్రకారం ట్యాంక్‌బండ్‌పై కేక్ కటింగ్‌లు, సంబరాలు చేసుకోవడం చట్టరీత్యా పూర్తిగా నిషేధం. గతంలోనే జీహెచ్ఎంసీ దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
-
పోలీసుల నిరంతర పహారా:పోలీసులు నిరంతరం గస్తీ కాస్తూ గుమికూడేవారిని పంపిస్తున్నప్పటికీ.. పోలీసు వాహనం వెళ్లగానే అర్ధరాత్రి మళ్లీ వచ్చి వేడుకలు చేసుకోవడం వల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి.
క్షణికానందం కోసం చేసే చిన్నపాటి పొరపాట్లతో అమూల్యమైన ప్రాణాలను పోగొట్టుకోవద్దు. దయచేసి అర్ధరాత్రి వేళల్లో ట్యాంక్‌బండ్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, ఫ్లైఓవర్లు, బహిరంగ ప్రదేశాల్లో సంబరాలకు స్వస్తి పలకండి అని సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు.
