Congress:తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై అదే పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తి జ్వాలను వెలిగించారు. ఈ విషయం ఇప్పడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలోని 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా ఓ చోట మీటింగ్ పెట్టారన్న గుసగుసలు అంతటా హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా నిధుల కేటాయింపు విషయంలో, మంజూరు విషయంలో వారంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతున్నది.
Congress:ఆ 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉమ్మడి పాలమూరు, నల్లగొండ జిల్లాలకు చెందినవారేనని గుసగుసలు. చేసిన పనులకు నిధుల విడుదలలో ప్రభుత్వంలోని కొందరు కీలక వ్యక్తులు కమీషన్లు అడుగుతున్నారంటూ వారంతా గుర్రుగా ఉన్నారని వినికిడి. వ్యాపారాల్లో కూడా వాటాలు అడుగుతున్నారని మరింతగా వారు రగిలిపోతున్నారు.
Congress:దీనికి తోడు ఇటీవల ఓ మీటింగ్‌లో 25 మంది ఎమ్మెల్యేల పనితీరును అధినేత బహిరంగపర్చడంపైనా కొందరు అభద్రతా భావానికి లోనైనట్టు తెలిసింది. దీంతో ఒకరు, ఇద్దరు ఇలాంటి అవమానాలతో ఇదే విషయాల్లో అసంతృప్తిగా ఉన్న ఇతర ఎమ్మెల్యేలను కూడగట్టినట్టు తెలిసింది. వారంతా కలిసేందుకు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. తమ అసంతృప్తిని పంచుకునేందుకే, భవిష్యత్ ప్రణాళికలపై ఏం చేయాలనే అంశాలపై చర్చించినట్టు సమాచారం.
10 మంది కాదా? 14 మంది ఎమ్మెల్యేలా?
Congress:అసలు తొలుత ఈ సమావేశాన్ని హైదరాబాద్ నగర పరిధిలోని ఓ ప్రధాన హోటల్‌లో నిర్వహించాలని అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భావించారని, ఈ సమావేశానికి 14 మంది ఎమ్మెల్యేలు హాజరు కావాలని భావించారని తెలిసింది. అయితే నిఘా వర్గాలు వారిపై కన్నేసినట్టు తెలిసిపోయింది. దీంతో అప్పటికప్పుడు సమావేశ స్థలాన్ని నగర సమీపంలోని ఓ యువ ఎమ్మెల్యే ఫామ్ హౌజ్‌కు మార్చినట్టు తెలిసింది. నిఘా వర్గాల నిశిత పరిశీలతో ఓ నలుగురు ఎమ్మెల్యేలు ఈ మీటింగ్‌కు వచ్చేందుకు భయపడ్డారని తెలిసింది. అయితే వారిలోనూ ఇవే అసంతృప్తి నెలకొని ఉన్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కలిసొచ్చే ఎమ్మెల్యేలను కలుపుకునేందుకు యత్నం
Congress:రాష్ట్ర ప్రభుత్వంలో అసంతృప్తి ఉన్న ఇతర ఎమ్మెల్యేలను కలుపుకునేందుకు యత్నించాలనే ప్రయత్నంలో ఆ 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తున్నది. 25 మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం అసంతృప్తి గతంలో వ్యక్తం చేసిన నాటి నుంచి ఓ వర్గం ఎమ్మెల్యేల్లో అభద్రతా భావం నెలకొన్నది. ఆ అభద్రతాభావం ఈ అసమ్మతి దాకా తీసుకొచ్చిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనిపై రాష్ట్రంలోని ముఖ్యులు ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా చేయకపోగా, కాంగ్రెస్ అధిష్టానం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి మరి.