Cockroach Janta Party

Cockroach Janta Party: విద్యాశాఖ మంత్రి దిగిపోవాల్సిందే.. మోదీ ప్రభుత్వానికి ‘కాక్రోచ్ జనతా పార్టీ’ డెడ్‌లైన్!

Cockroach Janta Party: సోషల్ మీడియాలో ఎంతో పాపులర్ అయిన ‘‘కాక్రోచ్ జనతా పార్టీ (CJP)’’ కేంద్ర ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరిక జారీ చేసింది. దేశంలో వరుసగా జరుగుతున్న రిక్రూట్‌మెంట్, ప్రవేశ పరీక్షల గందరగోళంపై ఈ వినూత్న పార్టీ మండిపడింది. జూన్ 13వ తేదీ లోగా దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఒకవేళ ఆయన దిగిపోకపోతే, జూన్ 20న దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని మోదీ ప్రభుత్వాన్ని అల్టిమేటం ఇచ్చింది.

దేశవ్యాప్తంగా వివిధ రకాల పోటీ పరీక్షల్లో పదేపదే తప్పులు, అవకతవకలు జరుగుతున్నాయని, దీనివల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిపోతోందని కాక్రోచ్ జనతా పార్టీ ఆరోపించింది. పూణేలో జరిగిన ఒక మీడియా సమావేశంలో సీజేపీ అధినేత అభిజిత్ దీప్కే మాట్లాడుతూ.. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దేశ యువత ఇకపై మౌనంగా కూర్చోబోదని స్పష్టం చేశారు. ముఖ్యంగా నీట్ (NEET) పరీక్ష వివాదం తర్వాత మనస్తాపానికి గురై కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ఎంతో బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నీట్, సీబీఎస్‌ఈ, సీయూటీ (CUET) వంటి కీలకమైన పరీక్షల్లో తలెత్తిన సమస్యల వల్ల దేశంలో దాదాపు కోటికి పైగా విద్యార్థులు నష్టపోయారని అభిజిత్ దీప్కే ఆరోపించారు. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, విద్యాశాఖ నుంచి కానీ ఎవరూ బాధ్యత తీసుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే జూన్ 6వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మంత్రి రాజీనామా కోరుతూ తాము నిరసన తెలిపామని గుర్తు చేశారు. జూన్ 13 లోగా మంత్రి గనుక తప్పుకోకపోతే, పూణే వేదికగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

తమ కార్యాచరణలో భాగంగా జూన్ 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు పూణేలో శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని, ఆ తర్వాత లక్నో, అమృత్‌సర్, జైపూర్, బెంగళూరు నగరాల్లో కూడా ఆందోళనలు చేపడతామని సీజేపీ తెలిపింది. అప్పటికీ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే జూన్ 20న దేశంలోని విద్యార్థులు, యువత అంతా పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకుంటారని స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ వేదికపై రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి చొరవ తీసుకోగలిగినప్పుడు, దేశంలోని విద్యార్థుల కోసం విద్యాశాఖ మంత్రి చేత రాజీనామా చేయించలేరా? అని అభిజిత్ దీప్కే ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *