Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో ‘సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్’ (CGGPOA) ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉనికి మరింత బలోపేతం అవుతుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల కార్యాలయాలన్నీ ఒకే చోటకు చేరడం వల్ల, వాటి మధ్య సమన్వయం పెరిగి ప్రజలకు మరింత వేగంగా, సమర్థవంతంగా సేవలు అందుతాయని ఆయన పేర్కొన్నారు. అమరావతిని ఒక ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దడానికి అవసరమైన పరిపాలనా మౌలిక సదుపాయాల కల్పనలో ఈ ప్రాజెక్ట్ ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
అనేక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే తాటిపైకి తీసుకురావడం ద్వారా పాలన మరింత సులభతరం అవుతుందని, ఇది రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి ఆకాంక్షలకు ఎంతగానో తోడ్పడుతుందని సీఎం వివరించారు. ఏపీలో అత్యుత్తమ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను (ప్రజా మౌలిక సదుపాయాలను) నిర్మించడంలో కేంద్ర ప్రభుత్వం నిరంతరం అందిస్తున్న మద్దతుకు ఈ నిర్ణయమే నిదర్శనమని ఆయన కొనియాడారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో అమరావతి నిర్మాణ పనులకు మరింత ఊపు రానుందని రాజకీయ, అధికార వర్గాలు భావిస్తున్నాయి.
