Revanth Reddy: హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవితాన్ని ప్రతిబింబించే ఆటోబయోగ్రఫీ “ప్రజల కథే నా ఆత్మకథ” పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో అత్యంత ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాజకీయ, సామాజిక రంగాల్లో వివిధ పార్టీ నాయకులు ఒకే వేదికపై కనిపించడం అరుదు. అయితే దత్తాత్రేయ వ్యక్తిత్వం ఆ కలయికకు కారణమైంది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు భావోద్వేగాలకు లోనయ్యాయి. “గౌలిగూడ గల్లీ నుంచి గవర్నర్ పీఠానికి చేరిన దత్తాత్రేయ అనేక రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. కానీ ప్రజలతో అతీతమైన అనుబంధాన్ని ఎప్పటికీ కోల్పోలేదు. ఆయన జీవితంలో ప్రతి పుట కూడా యువతకు మార్గదర్శకం కావాలి” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
పుస్తకావిష్కరణ వేదికపై తన రాజకీయ అనుభవాలను హాస్యాస్పదంగా పంచుకున్న సీఎం మాట్లాడుతూ — “స్కూల్ మోదీ దగ్గర, కాలేజ్ చంద్రబాబు దగ్గర, ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నాను అనే వ్యాఖ్యతో సభను నవ్వించారు. అలయ్ బలయ్ వంటి సమరసత వేదికలు రాజకీయాలకు అతీతంగా ప్రజల మద్దతు చూరగొన్నాయని గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి: Cm chandrababu: జెంటిల్‌మెన్‌కు నిజమైన ప్రతిరూపం బండారు దత్తాత్రేయే
పీజేఆర్ – దత్తాత్రేయలందరిలోనూ సామాన్యుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన నేతలు అని పేర్కొన్న సీఎం, తమ కేబినెట్ నిర్ణయాల్లో వీరి స్పూర్తి స్ఫురించుతుందని తెలిపారు. “దత్తాత్రేయ పార్టీకి పరిమితం కాని నాయకుడు – ఆయనను చూసి నూతన రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలి” అంటూ యువతకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం ఒక్క పుస్తకావిష్కరణ కాదు… ఇది ఒక నాయకుడి నిస్వార్థ సేవకు, విలువలతో నిండిన జీవనానికి ప్రజలు, నేతలిచ్చిన గౌరవం.