TG Public School

TG Public School: రేపు తొలి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!

TG Public School: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో అంతర్జాతీయ ప్రమాణాలు, కార్పొరేట్ హంగులతో తీర్చిదిద్దిన రాష్ట్రంలోనే మొట్టమొదటి మోడల్ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రేపు (బుధవారం) అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల విలీనం ద్వారా సరికొత్తగా ఆవిర్భవించిన ఈ విద్యా నిలయం విద్యా రంగంలో ఒక మైలురాయిగా నిలవనుంది.

కార్పొరేట్ సంస్థలకు పోటీగా ‘ఆరుట్ల’ స్కూల్..

ఆరుట్ల గ్రామంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఒకే చోట విలీనం చేస్తూ.. ప్రభుత్వం ఈ మోడల్ స్కూల్‌ను నిర్మించింది.

దాదాపు 5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఇక్కడ ఒకే ప్రాంగణంలో చిన్న పిల్లల (Pre-Primary) తరగతుల నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉచిత విద్యను అందించనున్నారు.

డిజిటల్ తరగతులు, అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ మరియు విద్యార్థుల శారీరక వికాసం కోసం విశాలమైన క్రీడా ప్రాంగణాన్ని (Playground) ఇందులో ఏర్పాటు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్..

రేపు ఆరుట్లకు రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మోడల్ పాఠశాల ప్రారంభోత్సవంలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

  • అల్పాహార పథకం టాప్-అప్: పాఠశాల భవనాన్ని ప్రారంభించిన అనంతరం, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం డిజైన్ చేసిన ‘అల్పాహార పథకాన్ని’ సీఎం స్వయంగా ప్రారంభించనున్నారు.

  • క్షేత్రస్థాయి పరిశీలన: స్కూల్‌లోని కంప్యూటర్ ల్యాబ్‌లను, డిజిటల్ క్లాస్ రూమ్‌లను ఇంకా క్రీడా సౌకర్యాలను సీఎం స్వయంగా పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించనున్నారు.

  • బహిరంగ సభ: ఈ పర్యటన ముగింపులో స్థానికంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించబోయే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ విధివిధానాలను వివరించనున్నారు.

అధికారుల ముమ్మర ఏర్పాట్లు..

ముఖ్యమంత్రి పర్యటన తోపాటు రాష్ట్రంలోనే తొలి పాఠశాల ప్రారంభోత్సవం కావడంతో సోమవారం రోజే ఉన్నతాధికారుల బృందం ఆరుట్లలో పర్యటించింది. ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోష్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి  ప్రముఖ విద్యా విషయాల నిపుణులు ఆకునూరి మురళి సంయుక్తంగా స్కూల్ క్యాంపస్‌ను సందర్శించి, భద్రత మరియు ప్రారంభోత్సవ ఏర్పాట్లను సమీక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *