Revanth Reddy: హైదరాబాద్ MCRHRD సెంటర్ లో రాష్ట్ర స్థాయి స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ మీట్-2025 కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.. “వాయిస్ ఫర్ ది వాయిస్‌లెస్” అనే థీమ్‌తో, తమ బాధను చెప్పుకోలేని చిన్నారులు, మహిళలకు రక్షణ కల్పించడం.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను కాపాడటం ముఖ్యమని అన్నారు.
ప్రతి బాధిత చిన్నారి భద్రతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు. “భరోసా” ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో 29 కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఈ కేంద్రాల్లో పోలీస్, న్యాయ, వైద్య, కౌన్సిలింగ్ సహాయంతో బాధితులకు మద్దతు అందిస్తున్నామన్నారు.
హైదరాబాద్ భరోసా సెంటర్ ఆధ్వర్యంలో మొదటిసారిగా చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ ప్రారంభించామని, ఇది పిల్లలకు అనుకూలమైన వాతావరణంలో న్యాయం చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పారు.
ఇది కూడా చదవండి: Suicide Crime News: అవమానించిన స్నేహితురాళ్లు..బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పోక్సో చట్టం, జ్యువెనైల్ చట్టాలను మరింత ప్రభావవంతంగా అమలు చేయాలని తెలిపారు.
సోషల్ మీడియా వల్ల పిల్లలకు కలిగే ప్రమాదాలను గమనించి, దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
“న్యాయం అనేది కేవలం కోర్టులోనే కాదు, ప్రతి దశలో పిల్లలకు రక్షణ అందించాలి. పోలీస్ స్టేషన్, భరోసా కేంద్రం, కోర్టు – ప్రతి చోటా చిన్నారులకు మద్దతు అవసరం” అన్నారు సీఎం.
సదస్సులో పాల్గొన్న వారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తూ.. “నేరాలకు శిక్షే చాలదు, బాధితుల జీవితాల్లో భరోసా నింపాలి. వారికి మరలా గౌరవంగా జీవించేలా చేయాలి. ఇది మనందరి బాధ్యత” అన్నారు.
చివరిగా, ముఖ్యమంత్రి చెప్పారు – చిన్నారులపై లైంగిక హింస చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని, అలాంటి వారిని ఎలా అయినా శిక్షిస్తామని స్పష్టంగా హెచ్చరించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బలంగా ఉంటుంది అన్నారు.