Revanth Reddy

Revanth Reddy: ‘మహిళలను కోటీశ్వరులను చేసేందుకే రోజుకు 18 గంటలు పనిచేస్తున్న

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలోని హకీంపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలు, స్థానిక రైతులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మహిళా సంఘాలే వెన్నెముక అని పేర్కొన్న ఆయన.. మహిళలను విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా, కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఇందుకోసమే తాను రోజుకు 18 గంటల పాటు నిరంతరం శ్రమిస్తున్నానని భావోద్వేగంగా వెల్లడించారు.

మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు సంప్రదాయ సాగును విడనాడి లాభసాటిగా ఉండే ఆరుతడి, ఉద్యాన పంటల వైపు దృష్టి సారించాలని సీఎం సూచించారు. కొడంగల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ఏకంగా రూ.10 వేల కోట్లకు పైగా నిధులతో వివిధ ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా త్వరలోనే ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందిస్తామన్నారు. భూసేకరణ ప్రక్రియలో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రైతులకు ఎకరానికి రూ.20 లక్షల వరకు భారీ పరిహారం ఇచ్చి ప్రభుత్వం అండగా నిలుస్తోందని వెల్లడించారు. గత పదేళ్ల పాలనలో కొడంగల్, పాలమూరు ప్రాంతాలకు తీరని అన్యాయం చేసిన బీఆర్‌ఎస్ నాయకులు.. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలకు దిగుతున్నారని, ప్రజలు ఆ తప్పుడు కూతలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

కొడంగల్ ప్రజలతో తనకున్నది పేగుబంధమని గుర్తుచేసుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తన రాజకీయ ఎదుగుదలకు, ముఖ్యమంత్రి స్థానానికి చేరుకోవడానికి కారణమైన కొడంగల్ ప్రజల రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు. అందరికీ దీపావళి ఒకరోజైతే, తన కుటుంబమైన కొడంగల్ ప్రజల మధ్య ఉన్నంత కాలం తనకు ప్రతిరోజూ పండుగేనని చెప్పారు. ప్రజలు అందించిన ఈ అవకాశంతో వచ్చే మూడేళ్లలోనే నియోజకవర్గంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలన్నింటినీ పరిష్కరించి, కొడంగల్‌ను దేశంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు సున్నా వడ్డీ రుణాలు, మార్కెటింగ్ సదుపాయాలు, ఉత్పత్తుల తయారీపై అత్యాధునిక శిక్షణను అందించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *