RTO Online Services: తెలంగాణలోని వాహనదారులకు రవాణా శాఖ భారీ ఊరట కల్పించింది. చిన్న పని కోసమైనా ఆర్టీవో (RTO) కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం, మధ్యవర్తులకు వేలకు వేలు సమర్పించుకునే రోజులకు తెరదించుతూ సరికొత్త డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఏజెంట్ల ప్రమేయం లేకుండా, నేరుగా ఇంటి వద్ద నుంచే మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా మూడు అత్యంత కీలకమైన సేవలను ఆన్లైన్లో పొందే వెసులుబాటును ప్రారంభించింది. ‘వాహన్ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్’ (Vahan Citizen Services Portal) ద్వారా కేవలం ఆధార్ ఓటీపీ (Aadhaar OTP) ఆధారంగా ఈ సేవలను సులభంగా పూర్తి చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చిన 3 కీలక సేవలివే..
-
వాహన యాజమాన్య బదిలీ (Ownership Transfer)
-
ఇతర రాష్ట్రాలకు తరలింపునకు నిరభ్యంతర పత్రం (NOC)
-
వాహన రికార్డుల్లో ఈ-కేవైసీ (e-KYC) వివరాల నవీకరణ
1. డిజిటల్ పద్ధతిలో యాజమాన్య బదిలీ (ఓనర్షిప్ ట్రాన్స్ఫర్)..
ఇంతకుముందు వాహనం కొన్నా లేదా అమ్మినా ఇరువైపులా ఆర్టీవో ఆఫీసుకు స్వయంగా వెళ్లాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం లేకుండా ఈ విధంగా ప్రక్రియను పూర్తి చేయవచ్చు:
-
విక్రేత లాగిన్: పోర్టల్‌లో వాహనం నంబర్, చాసిస్ లేదా ఇంజిన్ నంబర్ చివరి 5 అంకెలు, ఇన్సూరెన్స్/పొల్యూషన్ వివరాలతో వాహన విక్రేత లాగిన్ అయి ఆధార్ ఓటీపీతో ప్రాసెస్ ప్రారంభిస్తారు.
-
అప్లికేషన్ నెంబర్ జనరేషన్: కొనుగోలుదారు వివరాలు నమోదు చేయగానే ప్రత్యేక అప్లికేషన్ నెంబర్ వస్తుంది.
-
కొనుగోలుదారు ధ్రువీకరణ: ఆ నంబర్ సాయంతో కొనుగోలుదారు పోర్టల్‌లోకి లాగిన్ అయి, తన ఆధార్ ఓటీపీతో వివరాలను నమోదు చేస్తారు.
-
ఎన్సీఆర్బీ (NCRB) చెకింగ్: సదరు వాహనంపై ఏమైనా నేర రికార్డులు లేదా కేసులు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ద్వారా నేరుగా సిస్టమ్‌లోనే పరిశీలించుకోవచ్చు.
-
ఈ-సైన్ & కొత్త ఆర్సీ: ఆన్లైన్లో ఫీజు చెల్లించి, ఇరువైపులా ఆధార్ e-Sign పూర్తి చేయగానే దరఖాస్తు ఆటోమేటిక్‌గా ఆమోదం పొందుతుంది. అనంతరం ఆర్టీవో కార్యాలయం నుంచి కొత్త రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) జారీ అవుతుంది.
2. ఇతర రాష్ట్రాలకు ఎన్వోసీ (NOC) ఇలా సులువుగా..
వాహనాన్ని ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లాలన్నా లేదా అక్కడ విక్రయించాలన్నా అవసరమయ్యే నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) కోసం నేరుగా పోర్టల్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు:
-
వాహన వివరాలు నమోదు చేసి ఆధార్ ఓటీపీతో ధ్రువీకరించుకోవాలి.
-
పోర్టల్ నుంచే ఎన్సీఆర్బీ (NCRB) రిపోర్టును డౌన్లోడ్ చేసుకోవాలి.
-
నిర్ణీత ఫీజు ఆన్లైన్లో చెల్లించి, ఫారమ్-28 (Form-28) తో పాటు సంబంధిత పత్రాలను పోర్టల్‌లో అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
-
దరఖాస్తు నేరుగా సంబంధిత ఆర్టీవో కార్యాలయానికి చేరుతుంది. ఏజెంట్ల ప్రమేయం లేకుండా వేగంగా ఎన్వోసీ జారీ అవుతుంది.
3. ఈ-కేవైసీ (e-KYC) అప్డేట్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
వాహన రికార్డుల్లో యజమాని చిరునామా, ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు ఈ-కేవైసీ సేవను తీసుకొచ్చారు. అయితే ఈ ప్రక్రియలో కొన్ని కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది:
-
ఓటీపీ వ్యాలిడిటీ: ఆధార్ నంబర్‌కు వచ్చే ఓటీపీ 10 నిమిషాల పాటు మాత్రమే పనిచేస్తుంది. వివరాలు సరిచూసుకుని, ఆధార్ కాపీ, ఒరిజినల్ ఆర్సీని అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
-
తప్పులు దొర్లితే ఫీజు జప్తు: ఈ-కేవైసీలో ఒకసారి వివరాలు సమర్పించాక మార్పులు చేయడానికి వీలుండదు. తప్పుడు సమాచారం ఇస్తే దరఖాస్తు రద్దు కావడంతో పాటు చెల్లించిన ఫీజును జప్తు చేస్తామని రవాణా శాఖ స్పష్టం చేసింది.
-
అధికారిక పోర్టల్‌నే వాడండి: వాహనదారులు తమ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్లను సిద్ధంగా ఉంచుకోవాలని, ఎలాంటి ఓటీపీలను బయటి వ్యక్తులతో పంచుకోకుండా అధికారిక ‘వాహన్’ పోర్టల్ ద్వారానే పనులు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
