cm revanth reddy: హైదరాబాద్ హైటెక్ సిటీలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేసిన గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కేంద్రం రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. అదే ప్రాంతంలో మూడున్నర ఎకరాల్లో ఉన్న ఇందిరా మహిళా శక్తి సెంటర్ గురించి పేర్కొంటూ, “తెలంగాణ మహిళలు గూగుల్‌కు గట్టి పోటీగా నిలుస్తున్నారు” అని ఆయన చిరునవ్వుతో వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం, “ప్రపంచం వేగంగా డిజిటల్ యుగంలోకి వెళ్లిపోతోంది. డిజిటల్ భద్రత ఈ రోజుల్లో అత్యంత కీలకం. ప్రజల డేటా సురక్షితంగా ఉండాలంటే, ఇటువంటి సెంటర్లు అవసరం” అని అన్నారు.
గూగుల్‌ను ఇన్నోవేటివ్ కంపెనీగా అభివర్ణించిన ఆయన, తమ ప్రభుత్వం కూడా వినూత్న విధానాలతో ముందుకెళ్తోందని, రాష్ట్ర యువతకు నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు.
2035 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని ప్రకటించారు. తెలంగాణ రైజింగ్’ కార్యక్రమంలో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చే ప్రణాళికను అమలు చేస్తున్నామని వెల్లడించారు. “ఇక్కడి మహిళలు కేవలం లబ్ధిదారులుగా కాక, పెట్టుబడిదారులకు దీటైన పోటీదారులుగా ఎదుగుతున్నారు” అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

