Chandrababu

Chandrababu: అనకాపల్లి గడ్డను తాకిన పోలవరం గోదావరి జలాలు

Chandrababu: ఉత్తరాంధ్ర సాగు, తాగునీటి చరిత్రను శాశ్వతంగా మలుపు తిప్పే చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. నాలుగు నదులు, కఠినమైన తూర్పు కనుమల కొండలను దాటుకుంటూ పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ప్రవహించిన గోదావరి జలాలు అనకాపల్లి గడ్డను ముద్దాడాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట చేరుకున్న గోదారమ్మకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పసుపు, కుంకుమ, పూలు, చీర సమర్పించి అత్యంత భక్తిశ్రద్ధలతో జలహారతి ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు.

పాయకరావుపేటలో పండుగ వాతావరణం – సీఎంకు ఘన స్వాగతం..

పాయకరావుపేట పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రికి రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్రతో పాటు కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ జీపులో పోలవరం కాలువ వద్దకు చేరుకున్న సీఎం వెంట కళాకారులు కోలాట నృత్యాలు, సాంప్రదాయ తప్పెటగుళ్ల ప్రదర్శనలతో పండుగ వాతావరణాన్ని తలపించారు.పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు నీటి విడుదలకు గుర్తుగా ఏర్పాటు చేసిన అధికారిక శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం ప్రాజెక్టు నమూనాను (మోడల్) నిశితంగా పరిశీలించి ఇంజనీర్లతో సమీక్షించారు.

తొలిదశ లక్ష్యం – ప్రాజెక్టు స్వరూపం:

తొలి దశలో అనకాపల్లి సహా నాలుగు జిల్లాల పరిధిలోని 2.87 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 5.23 లక్షల మంది ప్రజలకు శాశ్వత తాగునీటి సరఫరా అందనుంది. వచ్చే ఏడాది నాటికి విశాఖ మహానగర పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు ఈ నీటిని తరలించనున్నారు. ఆ తర్వాత ప్రాజెక్టును ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’తో అనుసంధానం చేసి ఏకంగా 89 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడమే లక్ష్యమని ప్రభుత్వం వెల్లడించింది.
ఇంజనీరింగ్ అద్భుతం – నదులు దాటిన ప్రవాహం:
గోదావరి నీటిని కొండలు, వాగుల మీదుగా అనకాపల్లికి చేర్చడం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ఫీట్‌గా నిలిచింది. ఈ నాలుగు నదుల ప్రవాహాలను దాటేందుకు ఆధునిక సైఫన్లు, అక్విడెక్టులను నిర్మించారు. ఏలేరు నది బెడ్ లెవల్ కంటే దిగువ భాగం నుంచి నీటిని మళ్లించేందుకు ప్రత్యేక సైఫన్ వ్యవస్థను తీర్చిదిద్దారు. ముఖ్యంగా పంపా నదిపై 30 మీటర్ల లోతు వరకు 312 పైల్స్‌ను నిర్మించి భారీ అక్విడెక్ట్‌ను సిద్ధం చేయడం ప్రాజెక్టు ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. అనంతరం పాయకరావుపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొని ఉత్తరాంధ్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గోదావరి జలాలు ప్రవేశించడంతో అనకాపల్లి, విశాఖ పరిసర ప్రాంత రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *