Tamilnadu

Tamilnadu: కోట్ల విలువైన మరకత మురుగన్ విగ్రహం చోరీ!

Tamilnadu: తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రంలో అత్యంత విలువైన పురాతన విగ్రహం చోరీకి గురవడం భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చెంగల్పట్టు జిల్లా మధురాంతకం తాలూకా అచ్చిరుపాక్కం సమీపంలోని పెరుక్కరణై గ్రామంలో ఉన్న ప్రముఖ నడుపళని మరకత దండాయుధపాణి ఆలయంలో దుండగులు చొరబడి పచ్చల (మరకత) మురుగన్ విగ్రహాన్ని అపహరించుకుపోయారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ అరుదైన మరకత విగ్రహం విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

అర్ధరాత్రి దొంగతనం – అసలేం జరిగింది?..
మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఆలయ వెనుక ద్వారాన్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం గర్భగుడి తాళాలను ధ్వంసం చేసి, అక్కడ ప్రతిష్ఠించి ఉన్న దాదాపు 2.5 అడుగుల ఎత్తైన మరకత మురుగన్ విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు. బుధవారం ఉదయం నిత్య పూజల నిర్వహణ కోసం ఆలయానికి వచ్చిన ప్రధాన అర్చకుడికి తాళాలు పగులగొట్టి ఉండడం, గర్భగుడిలో ప్రధాన విగ్రహం మాయమవడం కనిపించడంతో నిర్ఘాంతపోయారు. వెంటనే ఆయన ఆలయ నిర్వాహకులకు, గ్రామస్తులకు సమాచారం అందించారు.
ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం – భక్తుల ఆందోళన..
కనకమలై లేదా నడుపళని కొండ పశ్చిమ పాదాల వద్ద ఆలమరల నడుమ కొలువైన ఈ ఆలయాన్ని మైసూరుకు చెందిన దత్తాత్రేయ ట్రస్ట్ నిర్వహిస్తోంది. పంగుని ఉత్తిరం, ఆడి కృత్తిక వంటి పర్వదినాల్లో ఈ క్షేత్రానికి తమిళనాడుతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శనాలు చేసుకుంటారు. ఎంతో మహిమాన్వితమైన క్షేత్రంగా పేరుగాంచిన ఈ ఆలయంలో పచ్చల విగ్రహం దొంగతనానికి గురికావడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత, ఆందోళన వ్యక్తమవుతున్నాయి.

రంగంలోకి పోలీసులు – ప్రత్యేక బృందాలతో గాలింపు:

ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు సిత్తామూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్, వేలిముద్రల నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు. విగ్రహ విలువను అధికారికంగా మదింపు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, అంతర్రాష్ట్ర ముఠాల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *