Chandrababu

Chandrababu: పిల్లలే మన సంపద.. 3వ బిడ్డకు రూ.30 వేలు, 4వ బిడ్డకు రూ.40 వేలు ఇష్టం..!

Chandrababu: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వేదికగా జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని, రాష్ట్ర అభివృద్ధి, జనాభా విధానం, ఉత్తరాంధ్ర వలసల నివారణపై పలు సంచలన ప్రకటనలు చేశారు. ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో అయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో తగ్గుతున్న జనాభా రేటు భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణను ప్రోత్సహించామని గుర్తుచేసిన ఆయన, మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు “పిల్లలే మన సంపద” అని ప్రకటించారు. జనాభాను పెంచేందుకు ప్రభుత్వం తరఫున విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.

సంతానోత్పత్తిని ప్రోత్సహించేలా భారీ నగదు ప్రోత్సాహకాలు:

మీరు గనక 3వ బిడ్డకు జన్మనిస్తే వెంటనే కుటుంబానికి రూ.30,000 ఆర్థిక సాయం అందిస్తాం. అలాగే 4వ బిడ్డకు జన్మనిస్తే  తక్షణమే రూ.40,000 అందజేస్తాం అన్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద రూ.15,000 ఇస్తున్నామని, భగవంతుడు కరుణించి ఆదాయం పెరిగితే ఈ మొత్తాన్ని మరింత పెంచుతామని హామీ ఇచ్చారు.

నేను ఎక్కడున్నా నా మదిలో ఉండేది పేదల సేవ మాత్రమే. అర్హులైన వారికి పెన్షన్లు నేరుగా ఇంటికే అందించి వారి ముఖాల్లో ఆనందం చూడటం నా జీవితంలో మరచిపోలేని అనుభూతి. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించి, తలసరి ఆదాయాన్ని పెంచడమే నా ప్రధాన లక్ష్యం.” అని సీఎం పేర్కొన్నారు.

ఉత్తరాంధ్రకు మహర్దశ.. వలసలకు చెక్!

దేశంలో ఏ పట్టణానికి వెళ్లినా అక్కడ ‘శ్రీకాకుళం కాలనీ’ కనిపిస్తుందని, ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్లడం తనను కలిచివేసిందని సీఎం అన్నారు.

ఉత్తరాంధ్ర నుండి వలసలు వెళ్లడం కాదు.. ఇతర ప్రాంతాల వారే ఉత్తరాంధ్రకు వలసలు వచ్చేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని సంకల్పం చెప్పారు. మరో రెండు నెలల్లోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తాం. ప్రజలు సహకరిస్తే పలాసలోనూ విమానాశ్రయం ఏర్పాటు చేస్తాం. అనకాపల్లిలో రూ.లక్ష కోట్లతో ‘ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్’ ఏర్పాటు కాబోతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్రకు పోర్టులు, ఐటీ కంపెనీలు ఇచ్చామని గుర్తుచేశారు. శ్రీకాకుళం జిల్లా వనరులున్నా వెనుకబడి ఉందని, జిల్లా ప్రజల 60 ఏళ్ల కల అయిన నేరేడి బ్యారేజీని మూడేళ్లలో, అలాగే వంశధార స్టేజ్-2 ప్రాజెక్టును జులై 27 నాటికి పూర్తి చేస్తామని గడువు విధించారు.

నేటి నుంచే ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రతను పెంపొందించేందుకు సరికొత్త డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు. గత 16 నెలలుగా స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే ఈ రోజు నుంచే ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

నెల రోజుల కార్యక్రమం: కలెక్టర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో నెల రోజుల పాటు ఈ క్లీన్ డ్రైవ్‌లు జరుగుతాయి. ప్రారంభంలో అన్ని ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు తీవ్రస్థాయిలో ఈ కార్యక్రమం ఉంటుంది.

వ్యర్థాల నుండి సంపద: ఒకప్పుడు నా పాదయాత్రల్లో చెత్తే ఎక్కువగా కనిపించేది, కానీ ఇప్పుడు చెత్త నుండి సంపద, కరెంట్ ఉత్పత్తి చేసేలా పార్కులను ఏర్పాటు చేశాం.

ప్లాస్టిక్ నిషేధం: సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను రాష్ట్రంలో పూర్తిగా నిషేధించాలి. స్వచ్ఛాంధ్రలో భాగంగా కుప్పం మండలానికి జాతీయ స్థాయిలో 3వ బహుమతి రావడం సంతోషకరమన్నారు.

గ్రీన్ ఎనర్జీ: ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయంపై సోలార్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.

భూముల జోలికి వస్తే సహించేది లేదు!

గత ప్రభుత్వ హయాంలో ‘గొడ్డలి పార్టీ’ చేసిన అరాచకాలను ప్రజలు చూశారని, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తులను మార్చేసి గందరగోళం సృష్టించారని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రజల భూముల జోలికి ఎవరూ రాకుండా కఠిన చర్యలు చేపట్టామని, రాష్ట్రంలో ఎక్కడా భూతగాదాలు లేకుండా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని భరోసా ఇచ్చారు.

సీఎం చంద్రబాబు శ్రీకాకుళం పర్యటనలో జనాభా పెంపుకు భారీ నజరానాలు ప్రకటించారు. ఉత్తరాంధ్ర వలసల నివారణకు నేరేడి బ్యారేజీ, వంశధార ప్రాజెక్టులకు గడువు విధించడంతో పాటు, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను 2 నెలల్లో తెరుస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రవ్యాప్త పరిశుభ్రత కోసం ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’కు శ్రీకారం చుట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *