Chandrababu: గోదావరి డెల్టా ప్రాంతం ఈరోజు దేశానికే అన్నపూర్ణగా మారిందంటే దానికి సర్ ఆర్థర్ కాటన్ దొర చూపిన చొరవే కారణమని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. బ్రిటిష్ వారు వెళ్లిపోయినా ఇప్పటికీ ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారని చెప్పారు. గతంలో 1970 నుండి 1980 మధ్య కాలంలో దవళేశ్వరం వద్ద నూతన బ్యారేజీని నిర్మించారని, నాటి మన ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు (NTR) ఆ కొత్త బ్యారేజీని ప్రారంభించారని గుర్తుచేశారు. దాదాపు 10 లక్షల 13 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా, 32 లక్షల క్యూసెక్కుల భారీ వరదను తట్టుకునేలా ఆనాడు దీని నిర్మాణం జరిగిందన్నారు. అయితే, 50 ఏళ్లు గడిచేసరికి బ్యారేజీ గేట్లు, మోటార్లు, ఎలక్ట్రిక్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నాయని.. తాము 2014లో అధికారంలోకి రాగానే రూ.32 కోట్లు కేటాయించి 194 గేట్లలో 64 గేట్లకు అత్యవసర మరమ్మతులు చేశామని చెప్పారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గేట్లు మార్చడం పక్కనబెట్టి, అవి కొట్టుకుపోతున్నా కనీసం పట్టించుకోలేదని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు.
వచ్చే ఏడాది (2027) రాబోయే ప్రతిష్టాత్మక గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించే పూర్తి బాధ్యత తమ కూటమి ప్రభుత్వానిదేనని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గతంలో జరిగిన రెండు పుష్కరాల సమయంలోనూ తానే ముఖ్యమంత్రిగా ఉన్నానని, ఇప్పుడు మూడోసారి కూడా ఆ అదృష్టం రావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ పుష్కరాల కంటే ముందే, కేవలం 9 నెలల వ్యవధిలో రూ.153 కోట్ల ఖర్చుతో కాటన్ బ్యారేజీలోని మిగిలిన 117 గేట్ల ఆధునీకరణ, మరమ్మతు పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా భావించి గతంలో తాము 72 శాతం పనులు పూర్తి చేశామని.. ఒకవేళ గత ఐదేళ్లూ తమ ప్రభుత్వమే ఉండి ఉంటే 2021 నాటికే పోలవరం పూర్తయ్యేదన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రూ.40 కోట్లతో కట్టిన అత్యంత విలువైన డయాఫ్రం వాల్ దెబ్బతిని గోదావరి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్లీ తాము రూ.990 కోట్లు కేటాయించి పనులు వేగవంతం చేశామని, 89 శాతం పనులు ముగిశాయని.. వచ్చే ఏడాది పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తిగా ముగించి జాతికి అంకితం చేస్తామని సభలో ప్రకటించారు.
వ్యవసాయం, మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు సభలకు కేవలం పురుషులే కాకుండా, ఆడబిడ్డలు కూడా పెద్ద ఎత్తున పచ్చ కండువాలు ఊపుతూ తరలిరావడం చూసి తన గుండె పులకించిందని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. మహిళలు కూడా మగవారితో సమానంగా ‘ప్రకృతి సేద్యం’ (సేంద్రీయ వ్యవసాయం) చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతామని చెప్పే స్థాయికి రావడం గర్వకారణమన్నారు. గతంలో తాము పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తీసుకువెళ్లామని, అక్కడ మిగిలిన కృష్ణా నీటిని శ్రీశైలంలో నిల్వ చేసి రాయలసీమకు అందించడం వల్లే రాయలసీమ దిశ, దశ పూర్తిగా మారిపోయాయని వివరించారు. సాగునీటి రంగం కోసం తమ ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే రూ.24 వేల కోట్లు ఖర్చు పెట్టిందని, మొన్న తుంగభద్ర డ్యామ్ గేట్లు కొట్టుకుపోతే రాత్రికి రాత్రే యుద్ధప్రాతిపాదికన మరమ్మతులు చేసి కాపాడామని గుర్తుచేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు మాట్లాడుతూ.. నిన్ననే తాను స్వయంగా ముంబై వెళ్లి హాస్పిటల్‌లో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించి వచ్చానని తెలిపారు. పవన్ కళ్యాణ్‌కు అభిమానులు ఎక్కువగా ఉండటం వల్ల ఆయన ఎక్కడికి వెళ్లినా జనాల తోపులాటలు, చేతులు పట్టి లాగడం సర్వసాధారణమని.. దానివల్ల ఆయన కుడి భుజం నరం దెబ్బతినడంతో ఆపరేషన్ జరిగిందని వివరించారు. ఆయన ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నారని.. “రాజకీయాల కంటే ఆరోగ్యం ముఖ్యం, శరీరం పూర్తిగా కుదుటపడ్డాకే తిరిగి విధుల్లోకి రావాలి” అని పవన్‌కు చెప్పి వచ్చినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పీఎం నరేంద్ర మోదీ లక్ష్యం 2047 నాటికి ‘వికసిత్ భారత్’ అయితే.. తనతో పాటు పవన్ కళ్యాణ్ లక్ష్యం 2047 నాటికి ‘స్వర్ణాంధ్రప్రదేశ్’ ని నిర్మించడమేనని స్పష్టం చేశారు.
జిల్లా అభివృద్ధి పనులకు సంబంధించి సీఎం చంద్రబాబు పలు కీలక హామీలు ఇచ్చారు:
-
రాబోయే రోజుల్లో రాజమహేంద్రవరం, పోలవరాన్ని కలుపుతూ ‘అఖండ గోదావరి ప్రాజెక్టు’కు నిజ స్వరూపం తీసుకువస్తామన్నారు.
-
పిచ్చుక లంక (65 ఎకరాలు), బొజ్జర్ల లంక (100 ఎకరాలు) ప్రాంతాలలో అద్భుతమైన టూరిజం హబ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు.
-
లంక భూముల కోతను నివారించడానికి నదిలో గ్రోయిన్స్ కడతామని, రేవులను బలోపేతం చేస్తామన్నారు.
-
కొత్తపేట రెవెన్యూ డివిజన్ ఆఫీస్ భవనానికి రిపేర్లు చేసి, మార్కెట్ కమిటీ స్థలాన్ని కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు.
-
అమలాపురం వద్ద 216 జాతీయ రహదారిని, పేరూరు వై జంక్షన్ నుండి రావులపాలెం రోడ్డును బాగు చేస్తామని.. కోనసీమ రైల్వే లైన్ కోసం కేంద్రంతో మాట్లాడి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
-
గోదావరి జిల్లా రోడ్లు నల్లరేగడి మట్టి వల్ల త్వరగా పాడవుతున్నందున, ఇక్కడ శాశ్వత పరిష్కారంగా సిమెంట్ (CC) రోడ్లు వేసేలా వినూత్న ఆలోచన చేస్తున్నామన్నారు.
చివరగా, రాష్ట్రంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లు, రౌడీయిజంపై చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. గంజాయి తాగి ఎవరైనా బయట తిరిగితే వారికి అదే చివరి రోజవుతుందని, దీనికోసం ప్రత్యేకంగా ‘ఈగిల్ టీమ్స్’ (Eagle Teams) పెట్టామని చెప్పారు. ఆడబిడ్డల జోలికి వస్తే పాతాళానికి తొక్కుతామని హెచ్చరించారు. రాజకీయాల కోసం కొందరు సోషల్ మీడియా వేదికగా మహిళలపై తప్పుడు వార్తలు రాస్తూ ‘క్యారెక్టర్ అసాసినేషన్’ (వ్యక్తిత్వ హననం) చేస్తున్నారని.. ఇటీవల పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై కూడా ఇలాగే అసభ్యంగా పోస్టులు పెట్టారని మండిపడ్డారు. అలాంటి రాక్షస మూకలకు ఫైనాన్స్ చేస్తూ సపోర్ట్ ఇచ్చే ‘గొడ్డలి పార్టీ’ నాయకులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు గట్టిగా హెచ్చరించారు.
