Nandamuri Tejaswini: నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఆ ఎంట్రీ కాస్త ఆలస్యమవుతున్నా.. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని నందమూరి (Tejaswini Nandamuri) మాత్రం అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తూ ఆ లోటును తీరుస్తున్నారు. ఒక రాజకీయ నేత భార్యగా, ఒక బాధ్యతగల తల్లిగా తన ఫ్యామిలీ బాధ్యతలను చూసుకుంటూనే.. తేజస్విని తెరవెనుక తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవల ఆమె సినిమా నిర్మాణ రంగంలోకి (Production) అడుగుపెట్టడమే కాకుండా, తండ్రి బాలకృష్ణ సినిమా ప్రాజెక్టుల విషయంలో కూడా పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు.
సాధారణంగా మీడియాకు, సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉండే తేజస్విని.. ఈ మధ్యకాలంలో తనలోని సరికొత్త టాలెంట్‌ను బయటకు తీస్తున్నారు. రెండు నెలల క్రితమే ప్రముఖ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్‌తో కలిసి అదిరిపోయే డ్యాన్స్ వీడియో చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేసిన ఆమె, ఇప్పుడు మరోసారి తన డ్యాన్స్ స్టెప్పులతో నెటిజన్లను ఆశ్చర్యపరిచారు. బాలయ్య కుమార్తెలో ఇంత మంచి డ్యాన్స్ స్కిల్స్ ఉన్నాయా అని నందమూరి అభిమానులు మురిసిపోతున్నారు.
తాజాగా నాగచైతన్య, సాయి పల్లవి నటించిన ‘లవ్ స్టోరి’ సినిమాలోని సూపర్ హిట్ ఫోక్ సాంగ్ ‘సారంగ దరియా’ (Saranga Dariya) పాటకు తేజస్విని అద్భుతంగా స్టెప్పులేశారు. సింగర్ మంగ్లీ పాడిన ఈ మాస్ పాటకు ఆమె వేసిన గ్రేస్‌ఫుల్ స్టెప్పులు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా “ఇంత మంచి టాలెంట్ పెట్టుకుని ఇన్నాళ్లు ఎక్కడ దాక్కున్నారు మేడం?” అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో డ్యాన్స్‌లో సాయి పల్లవికే గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నారంటూ సరదాగా పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం తేజస్విని నందమూరి చేసిన ఈ డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.
