Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటోంది. ముఖ్యంగా రాష్ట్ర ఆదాయ వనరులను సమర్థంగా వినియోగించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ఈ క్రమంలో ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు తాజా సమీక్ష నిర్వహించారు. అధికారుల నివేదికల ప్రకారం, 2025 ఏప్రిల్, మే నెలల్లో స్టాంప్స్, రిజిస్ట్రేషన్, జీఎస్టీ వంటి వాణిజ్య పన్నుల వసూళ్లలో గతేడాదితో పోల్చితే భారీ పెరుగుదల కనిపించింది. ఏప్రిల్‌లో రూ. 906 కోట్లు, మేలో రూ. 916 కోట్లు వసూలయ్యాయి. ఇది గత ఏడాది మే నెల వసూళ్లతో పోల్చితే రూ. 333 కోట్ల వరకు అధికం.
చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
-
పన్నులు వసూలు చేయడంలో ప్రజలకు అవగాహన కల్పించాలి
-
వెధింతలు లేకుండా, వినయంగా వసూళ్లు జరగాలి
-
వ్యవస్థలో లోపాలను సరిచేసి, దోపిడీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
పన్ను ఎగవేతకు తావు లేకుండా చూడాలి అని సీఎం స్పష్టం చేశారు. “వ్యాపారం చేస్తూ పన్ను ఎగవేయడమంటే కుదరదు” అని స్పష్టం చేశారు. అదే సమయంలో విశాఖ, విజయవాడ వంటి నగరాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఆదాయాన్ని మరింత పెంచాలన్నారు.
రాష్ట్రం మొత్తం 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 1.24 లక్షల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యం చేరితే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు మరింత బలమిచ్చే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Pakistan: పాకిస్థాన్‌లో రైలు ట్రాక్‌పై బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్‌ప్రెస్
కాకినాడ, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో వాణిజ్య పన్నుల వసూళ్లలో మంచి ఫలితాలు రావడంతో అక్కడి జాయింట్ కమిషనర్లను సీఎం ప్రశంసించారు.
ఇక మైనింగ్, మద్యం, ఇసుక తవ్వకాల వంటి శాఖల్లో ఆదాయాన్ని పెంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలన్నారు. ఉపగ్రహ డేటా ద్వారా ఖనిజాలపై సమాచారం సేకరించి, 30-40 శాతం అదనపు ఆదాయం సాధించవచ్చని తెలిపారు.
అంతేగాక, ఎర్రచందనం విక్రయం విషయంలో అంతర్జాతీయ ధరల బేరీజు వేసి, ఆదాయాన్ని గణనీయంగా పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని కీలక శాఖల్లో ఉత్తమ అధికారులను నియమించాలని సీఎం సూచించారు.
చివరగా, పన్నులు ఎగవేయకుండా ప్రతి ఒక్కరూ సమయానికి చెల్లిస్తే రాష్ట్ర అభివృద్ధికి అనేక మార్గాలు తెరచుకుంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు హితవు పలికారు.