TTD

TTD: తిరుమలలో పలు అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్..

TTD: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ఆహ్వానించింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి, జానకీదేవి తదితరులు ముఖ్యమంత్రిని కలిసి అధికారికంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వేద పండితులు సీఎం చంద్రబాబుకు వేదాశీర్వచనం పలికి, స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.
బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష – సాధారణ భక్తులకే పెద్దపీట..
రానున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు పోటెత్తే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, లడ్డూ ప్రసాదాల నిల్వ, పారిశుధ్యం, భద్రతా ఏర్పాట్లపై టీటీడీ ఛైర్మన్, ఈవో ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. దర్శనానికి వచ్చే సామాన్య భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. తాగునీరు, ఉచిత అన్నప్రసాదం, వసతి విషయంలో నిరంతరం పర్యవేక్షిస్తూ మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు ₹240 కోట్లు మంజూరు..
టీటీడీ ఉద్యోగుల చిరకాల స్వప్నమైన ఇళ్ల స్థలాల లేఅవుట్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి ఆమోదం తెలిపారు. ఈ మౌలిక వసతుల పనుల కోసం రూ. 240 కోట్ల వ్యయానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఉద్యోగుల గృహనిర్మాణ ప్రక్రియ వేగవంతం కానుంది.
తిరుమల అభివృద్ధి పనులకు ఆమోదం..

బ్రహ్మోత్సవ ఏర్పాట్లతో పాటు తిరుమలలో తలపెట్టిన పలు నూతన అభివృద్ధి, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని మరింత పెంచేలా దేవస్థానం పాలనను పారదర్శకంగా ముందుకు తీసుకెళ్లాలని పాలకమండలికి దిశానిర్దేశం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *