CJP Leaders

Abhijit Dipke: ధైర్యముంటే ఎమర్జెన్సీ ప్రకటించండి’.. సీజేపీ నేతలకి 5 రోజుల రిమాండ్

CJP Leaders: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికారిక నిరసన వేదికల జాబితా నుంచి జంతర్ మంతర్‌ను ఢిల్లీ పోలీసులు తొలగించిన (డీ-నోటిఫై చేసిన) మరుసటి రోజే.. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి అక్కడికి చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కీలక నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు ప్రత్యేక న్యాయస్థానం ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

పోలీసులు నమోదు చేసిన కేసుల అనంతరం వారిద్దరినీ దేశంలోనే అత్యంత కట్టుదిట్టమైన తీహార్ జైలుకు తరలించారు. మరో నేత అజింక్య షిండే వ్యక్తిగత పూచీకత్తుపై (బెయిల్ )విడుదలయ్యారు. ఈ అరెస్టులపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

జంతర్ మంతర్ వద్ద అసలేం జరిగింది?..

ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జంతర్ మంతర్‌ను నిరసనల వేదిక జాబితా నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయిన నేపథ్యంలో పోలీసులు అక్కడ భారీగా బారికేడ్లు, కంచెలు ఏర్పాటు చేశారు. అయితే మంగళవారం సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, అజింక్య షిండే తమ పార్టీ కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాలు చేతబూని అక్కడికి చేరుకున్నారు.
పోలీసులు అడ్డుకున్నప్పటికీ గేట్లు, బారికేడ్లను దాటుకుంటూ జంతర్ మంతర్ లోపలికి చొరబడ్డారు. దీంతో ముందస్తు అరెస్టు (ప్రివెంటివ్ కస్టడీ) కింద సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ట్రెస్‌పాసింగ్, విధుల ఆటంకం కింద కేసులు..
అనుమతి లేని ప్రాంతంలోకి చొరబడటం (Trespassing), ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం, గతంలో పొందిన బెయిల్ షరతులను ఉల్లంఘించడం వంటి సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదు చేశారు.
తెల్లవారుజామున 3 గంటలకు పీఎస్‌కు.. ఉదయం 8 గంటలకు మేజిస్ట్రేట్ ముందు హాజరు..
రహస్యంగా తరలించారని ఆరోపణ..
బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ నేతలను పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారని సీజేపీ లీగల్ హెడ్ రత్నా సింగ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. కనీసం తమ న్యాయవాదులను కూడా కలవనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు.
5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ..
బుధవారం ఉదయం 8 గంటలకు మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (SEM) ముందు ప్రవేశపెట్టగా.. మేజిస్ట్రేట్ ఇరు నేతలకు 5 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం వారిని తీహార్ జైలుకు తరలించారు.
పోలీసులు అబద్ధాలు చెప్పారు – లాయర్ అభిష్త్ హెలా..
సీజేపీ తరఫు న్యాయవాది అభిష్త్ హెలా మీడియాతో మాట్లాడుతూ.. “ప్రజలకు ఫోన్లు చేసి జంతర్ మంతర్‌కు రమ్మని రెచ్చగొట్టారంటూ పోలీసులు కోర్టులో పచ్చి అబద్ధాలు చెప్పారు. సౌరవ్ గానీ, అశుతోష్ గానీ ఎవరికీ ఫోన్లు చేయలేదు. కేవలం తప్పుడు ఆధారాలతో బలవంతంగా 5 రోజుల రిమాండ్‌కు పంపారు” అని స్పష్టం చేశారు.
జెండా ఎగురవేస్తే తప్పా?.. ధైర్యముంటే ఎమర్జెన్సీ ప్రకటించండి”: అభిజీత్ దీప్కే సవాల్
ఈ పరిణామాలపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఎక్స్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు:
“జంతర్ మంతర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించడమే వాళ్లు చేసిన తప్పా? దేశంలో ప్రజా వ్యతిరేకతను, అసమ్మతి స్వరాలను అణచివేయడానికి ఇలాంటి దొడ్డిదారి పిరికిపంద చర్యలు ఎందుకు? ప్రధాని మోదీ గారూ.. మీకు నిజంగా అంత ధైర్యం ఉంటే దొంగచాటుగా అరెస్టులు చేయడం ఆపి, అధికారికంగా దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించండి” అంటూ ఘాటుగా పోస్ట్ చేశారు.

 

పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా, జైళ్లకు పంపినా తమ నాయకుల, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని ఏమాత్రం దెబ్బతీయలేరని ఆయన స్పష్టం చేశారు.
‘వందేమాతరం అన్నందుకే జైలుకు పంపారు.. బ్రిటిష్ పాలన గుర్తొస్తోంది’: అజింక్య షిండే
వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలైన సీజేపీ నేత అజింక్య షిండే మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు:
“మేము జంతర్ మంతర్ వైపు వెళ్లి త్రివర్ణ పతాకాన్ని చేతబూని ‘భారత్ మాతా కీ జై’, ‘వందేమాతరం’ అని నినదించాం. దేశభక్తి నినాదాలు చేసినందుకే మా నాయకులను జైలుకు పంపారు.”

 

“పుట్టినరోజు నాడే అశుతోష్ రాంకాను జైలుకు పంపడం ఎంతో బాధాకరం. స్వాతంత్ర్య పోరాట కాలంలో జాతీయ జెండా పట్టి నినదిస్తే బ్రిటిష్ పాలకులు ఎలాగైతే జైళ్లలో వేసేవారో.. నేడు మోదీ, అమిత్ షాల పాలన కూడా అలాగే సాగుతోంది. మా నేతలను జైలుకు పంపి కార్యకర్తలను భయపెట్టాలనుకోవడం వారి భ్రమ. ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ఈ పోరాటం ఆగదు” అని హెచ్చరించారు.

 

కాగా, పార్టీ కీలక నేతల అరెస్టు నేపథ్యంలో తదుపరి పోరాట కార్యాచరణను ఖరారు చేసేందుకు కాక్రోచ్ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం బుధవారం అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ సమావేశం తర్వాత దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *