Ap news: సీఐడీ మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్‌పాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం నుంచి విజయ్‌పాల్‌ను సుధీర్ఘంగా విచారించిన ప్రకాశం జిల్లా పోలీసులు.. రాత్రి 9 గంటలకు అరెస్ట్ చేశారు. విజయ్‌పాల్ రిమాండ్ రిపోర్టును కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. మంగళవారం రాత్రి 9 గంటలకు విజయ్‌పాల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. రాత్రికి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌లోనే ఉంచి, బుధవారం ఉదయం గుంటూరుకు తరలించనున్నారు.
ఎందుకు అరెస్టు చేశారంటే..
2021లో అప్పటి ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి.. నర్సాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదైంది. రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ అధికారులు.. హైదరాబాద్ నుంచి రఘురామను గుంటూరు సీఐడీ ఆఫీసుకు తీసుకువచ్చారు. రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టారని తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై ఈ ఏడాది జూలై 11న గుంటూరులోని పాలెం పోలీస్ స్టేషన్‌లో రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ విజయ్‌పాల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఈ పిటిషన్ తోసిపుచ్చటంతో.. విజయ్‌పాల్ సుప్రీంకోర్టులో అక్టోబర్ 1న పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు పోలీసుల విచారణ సేకరించాలని సూచించింది. దీంతో ఆయనను మంగళవారం ఉదయం విచారించి రాత్రికి అరెస్టు చేశారు.