Hyderabad: హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రిలో చిన్న పిల్లాడి కిడ్నాప్ వ్యవహారం కలకలం సృష్టించింది. మగపిల్లాడు కావాలని కోరికతో ఓ మహిళ నెల రోజుల చిన్నారిని అపహరించింది. బాలుడి కిడ్నాప్ విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు.. పోలీసులకు సమాచారం అందించారు. కిడ్నాప్ వ్యవహారం తెలిసిన వెంటనే ఆసుపత్రి పరిసరాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ విషయంపై సమాచారం అందిన వెంటనే స్పందించిన పోలీసులు.. 5 గంటల వ్యవధిలోనే బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.
Hyderabad: జహీరాబాద్ కు చెందిన హసీనా బేగం.. హైదరాబాదులోని నీలోఫర్ ఆసుపత్రిలో ప్రసవం అయ్యింది. మగపిల్లాడు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకువచ్చిన సందర్భంలో కిడ్నాప్ కి గురయ్యాడు. బాబుని కాసేపు ఎత్తుకుంటానని మాయమాటలు చెప్పి తీసుకున్న ఓ మహిళ.. అటు నుంచి అటే పరారైంది. బాలుడిని ఎత్తుకున్న మహిళ కనిపించకపోవడంతో కిడ్నాప్ చేశారని గుర్తించిన బాధితులు.. నాంపల్లి పోలీసులకు సమాచారం అందించారు.
Hyderabad: చిన్నారి బాలుడి కిడ్నాప్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. వేగంగా స్పందించారు. అసుపత్రితో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ కెమెరాలను పరిశీలించారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి.. కిడ్నాప్ అయిన బాలుడి కోసం ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే నిలోఫర్ ఆసుపత్రి నుంచి బురఖా ధరించిన ఓ మహిళ కిడ్నాప్ చేసిన బాలుడుతో పాటుగా ఆటో ఎక్కినట్టుగా సీసీ టీవీ పుటేజ్ లో గుర్తించారు. కిడ్నాప్ చేసిన మహిళ.. జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ యూనివర్శిటీ దగ్గర దిగినట్లు గుర్తించారు.
Hyderabad: మహిళ బురఖాలో ఉండడంతో మొహాన్ని గుర్తించలేకపోయారు. కిడ్నాప్ చేసిన మహిళ ఆటో దిగిన తర్వాత ఎక్కిన బండి ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. స్కూటీ నంబర్ ప్లేట్ ద్వారా వాహనదారుడి వివరాలు సేకరించిన పోలీసులు.. అది ఎటువెళుతుందోనని ట్రాక్ చేశారు. ఆ వాహనం కర్నూలు వైపు వెళుతున్నట్టుగా గుర్తించిన పోలీసులు.. గద్వాల్ పోలీసుల సహకారంతో పొన్నూరు టోల్ ప్లాజా వద్ద వాహనాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వాహనంపై వెళ్తున్న మహిళలను మరో వ్యక్తిని అరెస్ట్ చేసి.. కిడ్నాప్ అయిన బాలుడిని కాపాడారు.