Cherlapally Fire accident: హైదరాబాద్ చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేజ్-1లో మంగళవారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదం తీరని నష్టాన్ని మిగిల్చింది. ఈ ఘటనతో అగ్నికీలలు ఎగిసి పడుతుండటంతో పరిసర ప్రాంతాల్లో కలకలం చెలరేగింది. రాత్రి మొత్తం ఆ పరిసర ప్రాంతవాసులు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. గంటలపాటు ఫైరింజన్లు నిర్విరామంగా చేసిన కృషి ఫలితంగా మంటలు అదుపులోకి వచ్చాయి. ఆ తర్వాత అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Cherlapally Fire accident:చర్లపల్లిలోని సర్వోదయ సాల్వెంట్స్ కంపెనీలోని ఓ ప్లాంట్‌లో మంగళవారం సాయంత్రం తర్వాత మంటలు చెలరేగాయి. అక్కడి సిబ్బంది తేరుకునేలోపు అగ్నికీలలు ఇతర ప్లాంట్లకు విస్తరించాయి. ఈలోగా అక్కడి భూగర్భంలో ఉన్న ట్యాంకుకు మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత మరింతగా పెరిగింది.
Cherlapally Fire accident:ఈ ఘటనలో రసాయనాలతో నిల్వ చేసి ఉన్న డ్రమ్ములు పేలిపోయి పెద్ద శబ్దాలతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ కంపెనీ పక్కనే ఉన్న మహాలక్ష్మి ప్లాస్టిక్స్, హరిత ఎంటర్ ప్రైజెస్, హైటెక్ ఇండస్ట్రీస్ కంపెనీలకు కూడా మంటలు వ్యాపించడంతో ఆయా కంపెనీల్లో పనిచేసే కార్మికులు పరుగులు తీస్తూ బయటకు వెళ్లారు. ఈ సమయంలో 3 కిలోమీటర్ల మేర దట్టంగా పొగలు కమ్మేయడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
Cherlapally Fire accident:ఆయా పరిశ్రమల్లో అగ్నికీలలు ఎగిసిపడుతుండటంతో పరిసరాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఉన్నఫలంగా దూరప్రాంతాలకు తరలివెళ్లారు. భారీ పేలుళ్ల శబ్దాలతో స్థానికులు మరింత భయాందోళన చెందారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక కూడా మంటలు ఎగిసిపడుతుండటంతో నిద్రాహారాలు మాని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. రాచకొండ సీపీ సుదీర్‌బాబు ఇతర అధికారులు ఘటనా స్థలానికి వచ్చి మంటలను ఆర్పించేందుకు చొరవ చూపారు.
చర్లపల్లిలో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు ప్రాథమిక విచారణలో షార్ట్ సర్క్యూట్ కారణంగా తేల్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.16 కోట్ల మేరకు ఆస్తినష్టం జరిగినట్టు అంచనా వేశారు. 8 ఫైరింజన్లను రప్పించి నిర్మిరామంగా సిబ్బంది చొరవతో గంటల తర్వాత మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.