Chandrababu: ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని నర్సింగోలు గ్రామంలో నిర్వహించిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రైతులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో విధ్వంసానికి గురైందని, భూములకు భద్రత లేకుండా పోయిందని మండిపడ్డారు. రైతుల సాగునీటి కష్టాలు తీర్చడం, ప్రతి ఎకరాకు నీళ్లివ్వడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తూ.. బీసీ రిజర్వేషన్లు, రైతుల ఆస్తి హక్కులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మీ భూమిపై వాళ్ల ఫొటోలేంటి? – ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం, పాస్ పుస్తకాల ముద్రణపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజముద్రతో పాస్ పుస్తకాలు..
రైతుల భూమి, రైతుల ఆస్తి.. కానీ సర్వే రాళ్ల మీద, పాస్ పుస్తకాల మీద మాత్రం వాళ్ల బొమ్మలు వేసుకున్నారు. ఇలాంటి వాళ్లు కూడా రాజకీయాల్లో ఉంటారా అనిపించింది. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసి, రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నాం” అని చెప్పారు.
రికార్డు స్థాయిలో పాస్ పుస్తకాల పంపిణీ..
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల 58 వేల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశాం. కేవలం అక్టోబర్ నెలలోనే 793 గ్రామాల్లో 4 లక్షల 58 వేల మందికి పంపిణీ పూర్తి చేశాం. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 24,116 మంది రైతులకు పాస్ పుస్తకాలు అందించాం. ఇకపై రైతులు అర్జీలు పట్టుకుని ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పరిస్థితి లేకుండా పూర్తి పారదర్శక వ్యవస్థను తెచ్చామన్నారు.
సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట – నర్సింగోలు రిజర్వాయర్ నిర్మాణం..
ప్రాంతీయ రైతాంగ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు:
-
ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.
-
ఈ రిజర్వాయర్ పూర్తయితే 9,500 ఎకరాలకు సాగునీరు, అలాగే 15 గ్రామాల్లోని 30,000 మంది ప్రజలకు తాగునీరు అందుతుందని వివరించారు.
-
ప్రాజెక్టుల నిర్మాణ నాణ్యతా ప్రమాణాల్లో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని తేల్చిచెప్పారు.
బీసీలకు 34% కంటే ఎక్కువ సీట్లిస్తాం” – వైసీపీ కుట్రలపై ఫైర్..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై సీఎం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేశారు:
-
వైసీపీది రెండు నాల్కల ధోరణి:“గత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించి, 16,800 మంది వెనుకబడిన వర్గాల ప్రజలు స్థానిక నాయకత్వాన్ని కోల్పోయేలా చేసింది. మేము అధికారంలోకి రాగానే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కమిషన్ వేసి ప్రయత్నిస్తే.. 50 శాతం దాటుతోందంటూ గొడ్డలి పార్టీ కోర్టుకెళ్లి అడ్డుకుంది. వెనుకబడిన వర్గాలు బాగుపడితే టీడీపీ బలపడుతుందనే అక్కసుతోనే వైసీపీ ఈ కుట్రలు చేసింది.”
-
పార్టీ పరంగా 34 శాతానికి పైగా టిక్కెట్లు:“బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. వారికి అండగా నిలబడటం నా బాధ్యత. కోర్టు తీర్పులు ఎలా ఉన్నా.. నేను మాట ఇస్తున్నా, రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు తప్పకుండా 34 శాతం కంటే ఎక్కువ సీట్లు కేటాయించి తీరుతాం” అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
రాష్ట్ర పునర్నిర్మాణమే నా లక్ష్యం..
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నరకాసుర వధ తర్వాత దీపావళి జరుపుకున్నట్లే.. గత పాలకుల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. “ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో పాటు 8 మంది కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం చర్చించాను. నా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఎవరినైనా కలవడానికి నేను సిద్ధం. ప్రజల ఉత్సాహమే నాకు కొండంత బలం, రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలిపే వరకు విశ్రమించేది లేదు” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
