Chandrababu

Chandrababu: ఐటీ నుంచి క్వాంటమ్ దిశగా స్వర్ణాంధ్ర.. ‘గొడ్డలి పార్టీ’ నెవర్ అగైన్!

Chandrababu: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మహానాడు-2026’ పండుగ సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాడర్‌లో సరికొత్త జోష్ నింపారు. ఏపీ లో మొత్తం 1,875 సెంటర్లలో వర్చువల్ (హైబ్రీడ్) పద్ధతిలో జరుగుతున్న ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. “మహానాడు అంటేనే కార్యకర్తల పండుగ. వర్చువల్ విధానం వల్ల రోడ్లపై మీ వాహనాల జోరు తగ్గిందేమో గానీ, మీ గుండెల్లో నాటి జోష్ అస్సలు తగ్గలేదు. మారింది మీటింగ్ విధానమే తప్ప.. మహానాడు సిద్ధాంతాలు కాదు” అని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఈ వేదికగా ఏపీ భవిష్యత్తు ప్రణాళికలు, పారిశ్రామిక ప్రగతిని ప్రకటిస్తూనే, ప్రతిపక్ష వైసీపీపై ఆయన పదునైన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు కింద ఇవ్వబడ్డాయి.

నాడు విజన్ 2020.. నేడు స్వర్ణాంధ్ర 2047!

టీడీపీ ఎప్పుడూ ఎన్నికల కోసం కాకుండా భావితరాల కోసం పనిచేస్తుందని చంద్రబాబు గుర్తుచేశారు.

  • మారిన యువత తలరాత: నాడు మనం తెచ్చిన ఒక్క ఐటీ రంగమే నేడు లక్షలాది మంది యువత తలరాతను, వారి తలసరి ఆదాయాన్ని, జీవన ప్రమాణాలను మార్చేసింది.

  • భారీ పెట్టుబడులు – ఉద్యోగాలు: రాబోయే రోజుల్లో ఏఐ (AI), క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా సెంటర్లు వంటివన్నీ ఏపీకి వస్తున్నాయి. 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడమే మన లక్ష్యం. దీని ద్వారా 23 లక్షల మంది యువతకు ఉద్యోగాలొస్తాయి. మేము 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పాం, ఎంవోయూలన్నీ పూర్తయితే అంతకంటే ఎక్కువే సాధిస్తాం. మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తూ 288 ప్రాజెక్టులు ప్రారంభించే డేట్‌ను కూడా ఫిక్స్ చేశాం.

  • మెగా డీఎస్సీ & పోలీస్ రిక్రూట్‌మెంట్: గత ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించినా, వాటన్నింటినీ దాటుకుని 15,941 మందికి మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలిచ్చాం. అలాగే 5,757 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా పూర్తి చేశాం.

మహిళల రక్షణ.. సూపర్ సిక్స్ హామీల అమలు

సంక్షేమం, సుపరిపాలన, సామాజిక న్యాయాన్ని తెలుగు నేలకు పరిచయం చేసింది టీడీపీనే అని చంద్రబాబు అన్నారు. ఆడబిడ్డలకు ఆర్థిక, సామాజిక గౌరవం ఇవ్వడంలో మనమే ముందున్నామన్నారు.

  • ఉచిత బస్సు & గ్యాస్ సిలిండర్లు: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. వంటింటి కష్టాలు తీర్చడానికి గతంలో ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇస్తే.. నేడు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం.

  • సోషల్ సైకోల తాటతీస్తాం: మహిళల రక్షణకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఆడబిడ్డల జోలికి వస్తే అదే వాళ్లకు చివరి రోజు అని నిరూపించాం. సోషల్ మీడియా సైకోల తాటతీసి మహిళల గౌరవాన్ని కాపాడతాం.

అమరావతి నిర్మాణం.. విశాఖ ఉక్కు సాధన

రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళికను వివరిస్తూ ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు.

  • అద్భుత రాజధాని: అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మిస్తున్నాం. వైసీపీకి రాజధానిపై ఒక విధానమంటూ లేదు, కేవలం విషం కక్కడమే వాళ్లకు తెలుసు. నాడు మూడు రాజధానులన్నారు, ఇప్పుడేమో మాది వైజాగ్ అంటున్నారు.. వీళ్లను ఏమనాలి?

  • వైజాగ్ స్టీల్ ప్లాంట్: విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్. కేంద్ర ప్రభుత్వ సహాయంతో విశాఖ ఉక్కును నిలబెట్టి, లాభాల బాట పట్టించాం. అలాగే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విశాఖ రైల్వే జోన్‌ను కూడా సాధించుకున్నాం.

కరెంట్ ఛార్జీలు పెంచబోము.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు!

రెండు సంవత్సరాల మునుపు రాష్ట్రం అంతా గుంతలమయంగా ఉంటే.. నేడు గుంతలు లేని రహదారులుగా మార్చి చూపించామని చంద్రబాబు అన్నారు.

  • నో పవర్ టారిఫ్ హైక్: భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచబోమని సీఎం హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలని, రాబోయే రోజుల్లో అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే రాబోతున్నాయని చెప్పారు.

  • భూములకు భద్రత: ప్రజల ఆస్తులను దోచుకోకుండా ఉండేందుకు వివాదాస్పద ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ను పూర్తిగా రద్దు చేశాం. గత పాలనలో దెబ్బతిన్న రెవెన్యూ రికార్డులన్నింటినీ ప్రక్షాళన చేస్తున్నాం. చెత్త పన్నును తొలగించి, ‘స్వచ్ఛాంధ్ర’ను మొదలుపెట్టాం.

రక్తచరిత్ర రాసేవారు స్వర్ణాంధ్ర చరిత్ర రాయలేరు!

వైసీపీ పాలనపై ఇంకా వారి రాజకీయ వ్యూహాలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “పేదలకు కావాల్సింది సంక్షేమ పథకాలు.. గొడ్డలి వేట్లు కాదు! యువతకు కావాల్సింది ఉద్యోగాలు.. గొడ్డలి పోట్లు కాదు. రక్తచరిత్ర రాసేవారు ఎప్పటికీ స్వర్ణాంధ్ర చరిత్రను లిఖించలేరు. ‘గొడ్డలి పార్టీ నెవర్ అగైన్’ (Goddali Party Never Again) అనేది ప్రతి ఒక్కరి మనసులో బలంగా ముద్రపడాలి. వేటకొడవళ్ల నుంచి గొడ్డలికి మారడం వాళ్ల విధానమైతే.. ఐటీ నుంచి క్వాంటమ్ టెక్నాలజీ దిశగా ఎదగడం మన విధానం” అంటూ ధ్వజమెత్తారు.

టీడీపీ.. నాయకులను తయారుచేసే విశ్వవిద్యాలయం!

ఎన్ని అరెస్టులు, పోలీస్ వేధింపులు జరిగినా, లోకేష్ ‘యువగళం’ పాదయాత్రను అడ్డుకున్నా, బాధితులనే నిందితులుగా మార్చి జైల్లో పెట్టినా మన కార్యకర్తలు ఎక్కడా తలొగ్గలేదని చంద్రబాబు కొనియాడారు. ఈ పోరాటంలో చంద్రయ్య, నందం సుబ్బయ్య వంటి ఎంతో మంది కార్యకర్తలు బలిదానాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమిలోని మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తే ప్రజలు బ్రహ్మాండంగా ఆశీర్వదించారని, ఆ నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. దేశంలో ఏ పార్టీకి లేని బలమైన కేడర్ టీడీపీ సొంతమని.. అనుచరులను కాదు, సమర్థవంతమైన నాయకులను తయారుచేసే ‘విశ్వవిద్యాలయం’ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *