Champions Trophy 2025: చాంపయిన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను దక్షిణాఫ్రికాకు ఇచ్చి టోర్నీని అక్కడే నిర్వహిస్తారన్న వార్త నేపథ్యంలో ఇంకో కొత్త కథనం బయటకు వచ్చింది. భారత్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు ఐసీసీ ఎలాగూ మొగ్గు చూపించదు కాబట్టి.. భారత్ ఆతిథ్యంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకూ రంగం సిద్ధమవుతుందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై అటు ఐసీసీ కానీ.. బీసీసీఐ కానీ ఎలాంటి ప్రకటనా వెలువరించకపోయినా తాజాగా ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందుకు సంబంధించి ఐసీసీ ఓ ప్రోమోను విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే సదరు వీడియో మాత్రం ఐసీసీ సోషల్ మీడియాలో మాత్రం కనిపించడం లేదు. డిసెంబర్ 1 లోపే పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించాల్సి ఉంటుంది. పాకిస్థాన్ కనుక ఒప్పుకోకపోతే ఐసీసీ ఛైర్మన్‌గా జైషా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ టోర్నీ మార్పు ఖాయమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించక టోర్నీ తరలిపోతే పాకిస్థాన్ క్రికెట్‌బోర్డుకు ఆర్థికంగా భారీ దెబ్బ తగిలే అవకాశం ఉంది. పాక్‌కు దక్కాల్సిన దాదాపు రూ. 548 కోట్లు రాకుండా పోయే ప్రమాదం ఉంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. చివరిసారిగా 2017లో ఇంగ్లండ్‌లో జరిగింది. అప్పుడు పాకిస్థాన్ విజేతగా నిలిచింది. తుది పోరులో భారత్‌పైనే పాక్ గెలిచింది.