AUS vs IND

AUS vs IND: బూమ్..బూమ్..బుమ్రా.. వాకా గ్రౌండ్ లో 5 వికెట్ల ప్రదర్శన

AUS vs IND: అత్యుత్తమ పేస్ బౌలింగ్ ఎలా ఉంటుందో..వారి గడ్డపైనే ఆస్ట్రేలియా జట్టుకు రుచి చూపించాడు జస్పీత్ బుమ్రా..విదేశీ పర్యటనల్లో  ఆతిథ్య జట్టు పేసర్ల బౌలింగ్‌లో భారత బ్యాటర్లు ఆపసోపాలు పడడం మాత్రమే మనం చూస్తుంటాం.. ఫర్ ఏ ఛేంజ్.. వాకా గ్రౌండ్ లో  ఓ భారత బౌలర్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక కంగారూ బ్యాటర్లు ఉక్కిరిబిక్కిరయ్యారు. 5 వికెట్లతో అతను చెలరేగడంతో ఆసీస్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 104 పరుగులకే ఆలౌటైంది.

తొలుత తొలి ఇన్నింగ్స్ లో అప్పటిదాకా ఆస్ట్రేలియా బౌలర్ల మెరుపులు చూసి ఔరా అన్న కామెంటేటర్లు తెల్లబోయారు. వాకా గ్రౌండ్ లో టీమిండియా పేసర్ ఇంతలా బౌలింగ్ చేస్తాడా అని ఆశ్చర్యపోయారు. అతడి అద్భుత బౌలింగ్‌కు ముగ్ధులైపోయి మాటల కోసం తడుముకున్నారు. ప్రపంచంలోనే పేస్ బౌలింగ్ ను అద్భుతంగా ఆడగలిగిన కంగారూ బ్యాటర్లు సైతం అతని బౌలింగ్ కు దాసోహమన్నారు. వికెట్లు అప్పగించి పెవిలియన్ చేరుకున్నారు. ఇదీ పెర్త్ టెస్టులో మన కెప్టెన్ బుమ్రా బౌలింగ్ ప్రదర్శన. సాధారణ పిచ్‌ల మీద కూడా బంతులను బుల్లెట్లలా సంధించే  జస్‌ప్రీత్‌ బుమ్రా.. పేసర్లకు స్వర్గధామంలా కనిపిస్తున్న వాకా పిచ్‌ పై చెలరేగాడు. మామూలుగానే అతడికి టెంపర్ మెంట్ ఎక్కువ. మొదటే టీమిండియాను 150 పరుగులకే ఆలౌట్ చేశారు. అంతే కసిగా రగిలిపోయిన  బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ జట్టును కకావికలం చేసాడు.  

గత రెండు కంగారూ బ్యాటర్లను పరీక్షించిన బుమ్రా.. ఈసారి పెర్త్ టెస్టులో  తన పేస్‌తో వారిని హడలెత్తించాడు. అత్యుత్తమ పేస్‌ బౌలింగ్‌ అంటే ఎలాంటిదో చూపిస్తూ అతను చిరస్మరణీయ ప్రదర్శన చేశాడు. కుడి చేతి వాటం బ్యాటర్లకు ఆఫ్‌ స్టంప్‌ ఆవల బంతి వేసి స్వింగ్‌ చేస్తే సమాధానమే లేకపోగా.. ఎడమ చేతి వాటం బ్యాటర్ల ఒంటి మీదికి దూసుకెళ్లిన బంతులూ అంతే ఇబ్బంది పెట్టాయి.బంతి బంతికీ గండంగా గడవడం.. తన ఓవర్‌ ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూడడం మినహా ఆస్ట్రేలియా బ్యాటర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది. ఎంత మేటి బ్యాటర్లైనా ఔటవ్వాల్సిందే అన్నట్లుగా అతను సంధించిన బంతులకు కంగారూల నుంచి సమాధానం లేకపోయింది. 

ఇది కూడా చదవండి: Vaibhav Suryavanshi: కుర్రాడే కానీ.. ఐపీఎల్ మెగా వేలంలో మెరుస్తున్నాడు!

AUS vs IND: జస్ప్రీత్ బుమ్రా పేస్, కచ్చితత్వం, స్వింగ్, సీమ్, బౌన్స్, థింకింగ్, స్లోయర్‌లు, యార్కర్లు ఇలా  ఫాస్ట్ బౌలర్ ఉపయోగించగలిగే దాదాపు ప్రతి అస్త్రం అతని అమ్ములపొదిలో సిద్ధంగా ఉంటుందిబంతిని స్వింగ్ చేయడం, సీమ్ చేయడం వేగంగా బౌన్స్ అయ్యేలా చేయగల నైపుణ్యం అతని సొంతం. అంతేకాదు ఉపఖండ బౌలర్లకు అవసరమైన రివర్స్ స్వింగ్ సైతం రాబట్టగలడు. స్వదేశం, విదేశం అని తేడా లేదు.. పిచ్‌ ఎలా ఉన్నా సరే.. అతను బంతి అందుకుంటే బ్యాటర్లలో వణుకు మొదలవ్వాల్సిందే. స్పిన్నర్లకు పెట్టింది పేరైన భారత్‌ నుంచి అలాంటి పేసర్‌ రావడం క్రికెట్‌ ప్రపంచానికి మింగుడు పడని విషయం. పేసర్ల నిలయమైన దేశాల్లో, ఆతిథ్య జట్టు బౌలర్లను మించి పిచ్‌లను ఉపయోగించుకోవడం అతడికే చెల్లు. భారత బ్యాటర్లను దెబ్బ కొట్టడం కోసం పిచ్‌ పేస్‌కు మరీ అనుకూలంగా తీర్చిదిద్దితే.. అసలుకే మోసం వస్తుందని విదేశీ జట్లు భయపడుతుంటాయి.

అయినా పెర్త్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా అదే తప్పు చేసింది. పేస్‌ వికెట్‌తో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టి తక్కువ స్కోరుకే ఆలౌట్‌ చేయగలిగింది కానీ.. తర్వాత బుమ్రాతో పొంచి ఉన్న ముప్పును ఊహించలేకపోయింది. అతడిని ఎదుర్కోవడానికి ఆసీస్‌ బ్యాటర్లు ఎంత సన్నద్ధమై వచ్చినా.. తన పేస్‌ ముందు వారి పప్పులుడకలేదు. ఖవాజాకు ఆడలేని బంతి వేసి స్లిప్‌ క్యాచ్‌తో అతణ్ని పెవిలియన్‌ చేర్చిన తీరు.. దూసుకెళ్లే బంతులతో మెక్‌స్వీనీ, స్మిత్‌లను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న వైనం.. దేనికదే ప్రత్యేకం. బ్యాటింగ్‌లో తక్కువ స్కోరుకే పరిమితమై డీలా పడ్డ జట్టులో.. బుమ్రా తన సంచలన బౌలింగ్‌తో ఉత్సాహం తీసుకొచ్చాడు. కెప్టెన్‌గా మరింత బాధ్యతలో బౌలింగ్‌ చేసిన బుమ్రా.. పెర్త్ టెస్టులో  జట్టును తిరుగులేని స్థితిలో నిలబెట్టాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *