BJP: ఇన్నాళ్లు రుణమాఫీకి, సబ్సిడీ పథకాలకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ తొలిసారి రైతు రుణమాఫీకి ముందుకొచ్చింది. ఈ మేరకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-మహాయుతి కూటమి తరఫున ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఆ మ్యానిఫెస్టోలో రైతు రుణమాఫీకి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చింది. ఇంకా పలు విషయాల్లో సబ్సిడీలను పెంచుతామని ఓటర్లకు ఆశల పల్లకి చూపింది. సంకల్ప్‌పత్ర పేరుతో కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విడుదల చేసిన ఈ మ్యానిఫెస్టోలో తాము మహారాష్ట్రలో అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురించి వివరించారు.
BJP: బీజేపీ-మహాయుతి కూటమి మ్యానిఫెస్టలో ప్రకారం.. ప్రధానంగా ఇప్పటి వరకు లడ్కీ బహిన్ యోజన కింద ఇస్తున్న నెలవారీ మొత్తాన్ని రూ.1500 నుంచి రూ.2100కు పెంచుతామని ప్రకటించింది. అదే విధంగా వృద్ధులకు ఇచ్చే పింఛన్‌ను కూడా రూ.1,500 నుంచి రూ.2100కు పెంచుతున్నట్టు తెలిపారు. తమ సర్కార్ హయాంలో 25 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే టెక్నాలజీ బలోపేతానికి విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. విద్యార్థులకు నెలకు రూ.10 వేలు, ఆశావర్కర్లకు రూ.15 వేలు, కరెంటు చార్జీల్లో 30 శాతం రాయితీ ఇస్తామని బీజేపీ-మహాయుతి కూటమి ప్రకటించింది.
BJP:అదే విధంగా అంతరిక్షం, ఏరోనాటిక్స్, ఫిన్‌టెక్ రంగాలను అభివృద్ధి చేస్తామని, ఏఐ శిక్షణకు ల్యాబుల ఏర్పాటు, యువతకు స్వామి వివేకానంద ఫిట్‌నెస్, ఆరోగ్య కార్డుల జారీ చేస్తామని హామీ ఇచ్చారు. మహారాష్ట్రను నంబర్‌వన్ రాష్ట్రంగా చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. దేశంలో మొదటి ఒక ట్రిలియన్ ఎకానమీ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. మాటపై నిలబడతామని, రైతులు, మహిళల సాధికారత కోసం కృషి చేస్తామని బీజేపీ నేతలు ప్రకటించారు.