House Arrest: తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య రాజకీయ పోరు తారాస్థాయికి చేరింది. నల్గొండ జిల్లాలో జరిగిన పరస్పర దాడుల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావును పోలీసులు తార్నాకలోని ఆయన నివాసంలో మంగళవారం హౌస్ అరెస్ట్ చేశారు. దాడికి గురైన బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డిని, ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ గృహనిర్బంధం విధించారు. పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి.
నల్గొండలో అసలేం జరిగింది?
నల్గొండ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది..మొదట బీజేపీ శ్రేణులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంపై కోడిగుడ్లతో దాడికి దిగాయి. దీనికి ప్రతిగా కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి నివాసాన్ని ముట్టడించి ధ్వంసం చేశాయి. ఈ దాడిలో వర్షిత్‌రెడ్డితో పాటు ఆయన తల్లి కూడా గాయపడ్డారు.
వారం రోజుల్లో రెండోసారి హౌస్ అరెస్ట్.. రాంచందర్‌రావు మండిపాటు..
గత వారం రోజుల్లో తనను గృహనిర్బంధం చేయడం ఇది రెండోసారని ఆయన తెలిపారు. గతంలో నిరసన తెలుపుతున్న విద్యార్థులను కలవకుండా అడ్డుకున్న పోలీసులు, ఇప్పుడు దాడిలో గాయపడిన తమ పార్టీ జిల్లా అధ్యక్షుడిని పరామర్శించకుండా నిరోధించడం దుర్మార్గమని విమర్శించారు.
రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం గురించి ఉపన్యాసాలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ.. ఆచరణలో మాత్రం పోలీసుల ద్వారా ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా నిలవకుండా అడ్డుకోవడం ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమన్నారు.
కాంగ్రెస్‌కు బీజేపీ అంటే భయం
రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఇలాంటి దాడులు, కుట్రలకు పాల్పడుతున్నారని, ఇలాంటి అణచివేత చర్యలను పునరావృతం చేస్తే ప్రజలతో కలిసి తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర అధ్యక్షుడి హౌస్ అరెస్ట్‌తో నల్గొండతో పాటు రాజధాని హైదరాబాద్‌లోనూ రాజకీయ వేడి రాజుకుంది.
