Bill Gates: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోజురోజుకూ ఎంత వేగంగా ఎదుగుతోందో చూస్తున్నాం. అయితే ఈ టెక్నాలజీ మంచి కోసం కాకుండా చెడ్డవాళ్ల చేతుల్లోకి వెళితే సర్వనాశనమే జరుగుతుందని మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ గట్టిగా హెచ్చరించారు. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఏఐ వల్ల కేవలం ఉద్యోగాలు పోవడమో, చిన్న చిన్న తప్పులు జరగడమో మాత్రమే కాదు, సమాజానికి కీడు చేయాలనుకునే వాళ్ల చేతికి ఇది చిక్కితే ఏకంగా 100 కోట్ల మంది ప్రాణాలు పోయేంత పెద్ద విపత్తు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఏఐ రక్షణ బాధ్యతను కేవలం కంపెనీలకే వదిలేస్తే సరిపోదని, ప్రభుత్వాలు నేరుగా జోక్యం చేసుకుని కఠినమైన రూల్స్, చట్టాలు తీసుకురావాలని గేట్స్ డిమాండ్ చేశారు.
ఇదివరకు చూసిన ఆయుధాల కంటే ప్రమాదకరం.. బిల్ గేట్స్ మాటల్లోనే..
మనం ఇప్పటివరకు చూసిన యుద్ధ ఆయుధాల కంటే ఇది చాలా భిన్నమైనది. ఒకపక్క రోజురోజుకూ తెలివితేటలు పెంచుకుంటున్న సరికొత్త టెక్నాలజీ, మరోపక్క సమాజానికి చేటు చేయాలనుకునే దుర్మార్గులు.. ఈ రెండూ కలిస్తే వచ్చే నష్టాన్ని ఊహించడం కూడా కష్టమని చెప్పారు.
అమెరికాలో దీనిపై ప్రభుత్వం చట్టాలు తేవాలా అని అడిగితే.. “ఖచ్చితంగా తేవాలి” అని తేల్చిచెప్పారు. కంపెనీలు సొంతంగా భద్రత చూసుకుంటామని చెప్పే మాటల మీద ఆధారపడకూడదని, పోలీసులు, ప్రభుత్వాలు కలిసి దీనికి సరైన నిబంధనలు పెట్టాలని స్పష్టం చేశారు.
నియంత్రణలు కావాలంటున్న వాళ్లు..
ఆంత్రోపిక్, ఓపెన్ ఏఐ వంటి పెద్ద కంపెనీల అధికారులు కూడా ప్రభుత్వ పర్యవేక్షణ, కఠిన నిబంధనలు ఉండాలని కోరుకుంటున్నారు. మైక్రోసాఫ్ట్ అధికారులు కూడా పోటీ పడి ఏఐ సిస్టమ్స్ తేవడం కంటే ముందే భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలని అంటున్నారు.
కంపెనీలే చూసుకోవాలంటున్న మెటా
మెటా (ఫేస్‌బుక్) అధినేత మార్క్ జుకర్‌బర్గ్ లాంటి వాళ్లు మాత్రం.. బయట నుంచి రూల్స్ పెట్టడం కంటే, ఏ కంపెనీకి ఆ కంపెనీయే లోపల సెక్యూరిటీ చూసుకుంటే మంచిదని వాదిస్తున్నారు.
అమెరికాలో పరిస్థితులు
దేశ భద్రతను చూసుకోకుండా హడావుడిగా చట్టాలు చేయకూడదని కొందరు రాజకీయ నేతలు అంటున్నప్పటికీ.. కాలిఫోర్నియా, న్యూయార్క్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఏఐ భద్రతపై సొంతంగా నిబంధనలు తయారు చేయడం మొదలుపెట్టాయి.
అణుబాంబు, రోగాలతో సమానమైన ప్రమాదం..
గతంలోనే పలువురు ఏఐ సైంటిస్టులు దీనిపై వార్నింగ్ ఇచ్చారు. అణుబాంబులు పేలినా, ప్రపంచమంతా ప్రాణాంతక రోగాలు వ్యాపించినా ఎంత ఘోరం జరుగుతుందో.. స్వతంత్రంగా ఆలోచించే ఏఐ రోబోలు, ఆయుధాలు చెడ్డవాళ్ల చేతుల్లోకి వెళ్లినా అంతే వినాశనం జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రమాదం ముంచుకొచ్చేలోపే ప్రభుత్వాలు కళ్లు తెరవాలని బిల్ గేట్స్ తేల్చిచెప్పారు.
