Bhu Bharathi: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న భూ భారతింలో భాగంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఓ అధికారి చొప్పున నియమించనున్నది. గతంలో వీఆర్వోల మాధిరిగానే ఈ అధికారి పేరు జీపీవో గ్రామ పరిపాలన అధికారి అనే నామకరణం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్న వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారు. మళ్లీ ఊరికి ఒకరు చొప్పున రైతులకు అందుబాటులో ఉండేందుకు ఈ నియామక ప్రక్రియను ఈ ప్రభుత్వం మొదలుపెట్టింది. దీనికోసం గతంలో పనిచేసిన వీఆర్వోలు, వీఆర్ఏలకే అవకాశం ఇచ్చింది.
Bhu Bharathi: గతంలో వీఆర్వోలు, వీఆర్ఏలుగా పనిచేసిన వారిలో అర్హతలను బట్టి రెవెన్యూ శాఖలోకి తీసుకుంటారన్నది త్వరలోనే తేలనున్నది. యథాతథంగా వీఆర్వోలనే తీసుకుంటే విమర్శలు వస్తాయన్న నేపథ్యంలో ఆ పేరును మార్చినట్టు అర్థమవుతున్నది. అయితే ఈ గ్రామ పరిపాలనా అధికారికి రెవెన్యూ బాధ్యతలతోపాటు మరికొన్ని బాధ్యతలను అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వ భూముల రక్షణ, ఇసుక, మైనింగ్ అక్రమ రవాణా నియంత్రణతోపాటు సాధారణ పరిపాలనా విధులు ఉంటాయి.
Bhu Bharathi: వచ్చే ఏడాది జనవరి నెలాఖరులోగా ఈ గ్రామ పరిపాలనాధికారుల నియామకాలను పూర్తిచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. భూభారతి చట్టం 2024 నిబంధనలు రూపొందించి, అమలు చేయకముందే వీరిని ఉద్యోగంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది.