How to Check Fresh Egg: ఆరోగ్యానికి గుడ్డు అందించే మేలు అంతా ఇంతా కాదు. ఇదొక అద్భుతమైన ‘సూపర్ ఫుడ్’ కండరాల బలానికి (మజిల్ బిల్డింగ్), బరువు పెరగడానికి లేదా తగ్గడానికి.. ఇలా ఫిట్‌నెస్ ప్రియులందరికీ గుడ్డు మొదటి ఛాయిస్. ప్రోటీన్లతో పాటు ఇందులో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. అందుకే చాలా మంది మార్కెట్‌కు వెళ్లినప్పుడు ఒకేసారి గుడ్ల ట్రేలను కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ చేసుకుంటారు.
కానీ, ఒక నిర్దిష్ట సమయం దాటిన తర్వాత గుడ్డు తినడానికి పనికిరాదనే విషయం మీకు తెలుసా? పాడైపోయిన గుడ్లు తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, కడుపు నొప్పి, వాంతులు ఇంకా ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే గుడ్డు ఎంతవరకు తాజాగా ఉందో తెలుసుకోవడం చాలా అవసరం. గుడ్డును పగల్గొట్టకుండానే అది తాజాగా ఉందో లేదో ఇంట్లోనే సులభంగా ఎలా గుర్తించవచ్చో భారతీయ ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) కొన్ని సులువైన చిట్కాలను చెప్పింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
గుడ్డులోని పోషక విలువలు ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు
గుడ్డును సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. ఇందులో శరీరానికి కావలసిన ఎన్నో ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి..
-
హై-క్వాలిటీ ప్రోటీన్: గుడ్డు ప్రోటీన్లకు అద్భుతమైన మూలం. ఇది కండరాలను బలోపేతం చేయడానికి అలాగే రోజంతా నీరసం లేకుండా ఉత్సాహంగా ఉంచడానికి సహాయపడుతుంది.
-
ఎముకల పుష్టి: ఇందులో ఉండే కాల్షియం ఇంకా విటమిన్ డి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
-
మెదడు, కంటి ఆరోగ్యం: గుడ్డులో ఉండే ‘కోలిన్’ అనే మూలకం మెదడు పనితీరును (బ్రెయిన్ ఫంక్షన్) పెంపొందిస్తుంది. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపును మెరుగుపరుస్తాయి.
-
ఇతర పోషకాలు: ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ బి12, ఫోలేట్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి మేలు చేసే అంశాలు ఇందులో ఉన్నాయి. ఇది ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉంచడం వల్ల బరువు నియంత్రణలోనూ తోడ్పడుతుంది.
గుడ్డు తాజాగా ఉందో లేదో ఎలా చెక్ చేయాలి? (FSSAI వాటర్ టెస్ట్)
గుడ్డును పగల్గొట్టకుండానే దాని తాజాదనాన్ని పరీక్షించే ఒక సింపుల్ ట్రిక్‌ను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. దీనికోసం మీరు కేవలం ఒక పాత్రలో లేదా గ్లాసులో నీటిని తీసుకుని ఈ క్రింది విధంగా పరీక్షించవచ్చు.
-
తాజా గుడ్డు (Fresh Egg): నీటి పాత్రలో గుడ్డును వేసినప్పుడు అది పూర్తిగా నీటి అడుగుభాగానికి మునిగిపోయి, అడ్డంగా పడుకుంటే.. అది పూర్తిగా తాజాగా (ఫ్రెష్‌గా) ఉందని అర్థం. దీన్ని నిశ్చింతగా తినవచ్చు.
-
కొంచెం పాత గుడ్డు (Stale Egg): గుడ్డు నీటి అడుగుకు వెళ్లినప్పటికీ మునగకుండా నిలువుగా నిలబడితే.. అది కొన్ని రోజులు గడిచిన పాత గుడ్డు అని అర్థం. అయితే ఇది పాడైపోలేదు, తినడానికి పనికొస్తుంది.
-
పాడైపోయిన గుడ్డు (Bad/Rotten Egg): ఒకవేళ గుడ్డు నీటి అడుగుకు వెళ్లకుండా పైనే తేలడం ప్రారంభిస్తే.. అది పూర్తిగా పాడైపోయిందని అర్థం. ఇటువంటి గుడ్లలో గ్యాస్ నిండటం వల్ల అవి నీటిపై తేలుతాయి. వీటిని పొరపాటున కూడా తినకూడదు, వెంటనే పారేయాలి.
గుడ్లలో కల్తీ.. జాగ్రత్త!
గుడ్డు ఎంతో లాభదాయకమైనదే అయినప్పటికీ.. ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో గుడ్ల కల్తీ కూడా ఎక్కువైంది. గుడ్లు ప్రకాశవంతంగా, సరికొత్తగా కనిపించడం కోసం చాలా చోట్ల వాటిపై రసాయనాలు (కెమికల్స్) పూయడం లేదా ఒక రకమైన నూనె పొరను (ఆయిల్ లేయర్) దట్టించడం లాంటివి చేస్తున్నారు.
ఇలాంటి రసాయనాలు పూసిన గుడ్లు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి కానీ, ఇవి ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తాయి. ఇటువంటి కల్తీ గుడ్ల వల్ల కడుపునొప్పి, అలర్జీలు ఇంకా ఫుడ్ పాయిజనింగ్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గుడ్లు కొనేటప్పుడు, తినేటప్పుడు పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటించడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
