Champions Trophy 2025: ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టులో బీసీసీఐ కొన్ని మార్పులు చేసింది. ఐదు టీ20ల సిరీస్‌లో అద్భుత ప్రదర్శన ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ సాధించిన వరుణ్ చక్రవర్తీని వన్డే జట్టులోకి చేర్చారు. మరోవైపు, వెన్నునొప్పితో బాధపడుతున్న జస్‌ప్రీత్ బుమ్రాను జట్టు నుండి తొలగించారు. ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహంగా రేపటినుండి ఆడబోయే ఈ వన్డే సిరీస్ లో చివరి మ్యాచ్ బుమ్రా అందుబాటులో ఉంటాడని అంతా ఆశించారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.
బీసీసీఐ మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేసింది, “పురుషుల సెలెక్షన్ కమిటీ వరుణ్ చక్రవర్తీని ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టులో ఎంపిక చేసింది. ప్రత్యేకించి ఐదు టీ20ల సిరీస్‌లో వరుణ్ చక్రవర్తీ 14 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఆ ప్రదర్శనతోనే అతన్ని వన్డే జట్టులోకి తీసుకున్నారు. ఇప్పటికే వరుణ్ చక్రవర్తీ భారత జట్టుతో కలిసి ఉన్నాడు.
అయితే… జస్‌ప్రీత్ బుమ్రా గాయం గురించి ప్రస్తావించలేదు కానీ, మార్చిన వన్డే జట్టులో అతని పేరు లేదు. ముందుగా ప్రకటించిన జట్టులో బుమ్రా పేరు ఉన్నప్పటికీ, అతని ఫిట్‌నెస్ గురించి స్పష్టత కోసం ఇప్పటివరకు వేచి చూశారు. అయితే ముందు జాగ్రత్త చర్యల రీత్యా బుమ్రా చివరి మ్యాచ్ ఆడే అవకాశం లేకుండా అతని పేరును తొలగించారు.
Champions Trophy 2025: రవిచంద్రన్ అశ్విన్ వంటి మాజీ క్రికెటర్లు వరుణ్ చక్రవర్తీని ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపిక చేయాలని కోరారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అతని ఎంపిక చేయడం వెనుక ఉద్దేశ్యం ఉన్నట్లు అనిపిస్తోంది. ఫిబ్రవరి 6న నాగ్‌పూర్‌లో తొలి వన్డేతో సిరీస్ ప్రారంభం కానుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న దుబాయ్‌లో ప్రారంభమవుతుంది, అక్కడ భారత్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, 23న పాకిస్థాన్, మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడనుంది. దుబాయ్ పిచ్‌లు స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండడంతో వరుణ్ చక్రవర్తీని జట్టులో చేర్చారు. అతనితో పాటు కుల్దీప్ యాదవ్ కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇస్తే ఇక ప్రత్యర్థి బ్యాటర్లకు నిద్రలేని రాత్రులు ఖాయం. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో మంచి ప్రదర్శన చేస్తే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపికయ్యే అవకాశం అతనికి ఉంది.
ఇది కూడా చదవండి: Puja Hegde: అలా వైకుంఠపురంలో తమిళ మూవీ అంటున్నపూజా హెగ్డే.. ఏకిపారేస్తున్న నెటిజన్స్!
సవరించిన భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ.