Meenakshi

Meenakshi: Who Is She? కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?

Meenakshi: హూ ఈజ్‌ షి? తనే రాహుల్‌ అనుకుంటోందా? తనే సోనియా అనుకుంటోందా? ఎవరండీ ఆమె? ఎందుకీ ఓవరాక్షన్‌? అసలు తెలంగాణతో ఏం సంబంధం ఆమెకు? తెలంగాణ పౌరురాలు కాదు, పదేళ్లుగా కేసీఆర్‌ విషపు చూపులకు బాధితురాలు కాదు. ఒక్కొక్కరం ఎన్నో తట్టుకుని నిలబడ్డాం. తట్టుకున్నాం. ఇప్పుడు హఠాత్తుగా వచ్చి తానే పార్టీ హైకమాండ్ అన్నట్గుగా, పార్టీ మీద సర్వహక్కులూ దఖలు పడ్డట్టుగా ఎందుకు వ్యవహరిస్తోంది? Who Is She..? ఇదీ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో వ్యవహారాలపై రగిలిపోతున్న కొందరు నేతల పరిస్థితి. ఇంతకీ వీరి కోపం ఎవరి మీద అంటారా? ఎన్నో అంచనాల నడుమ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్‌గా తెలంగాణలో అడుగుపెట్టిన మీనాక్షి నటరాజన్‌ గురించే వారి ఆవేదన. ఒక రకంగా ఆగ్రహం అనాలేమో.

కాంగ్రెస్ పార్టీలో వివాదాలు కొత్తకాదు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆ పార్టీలో ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ విపక్షాల కన్నా సొంత పార్టీ నేతల తీరు వల్లే పలు ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఆ పార్టీ సీనియర్ నేతలు వాపోతున్న పరిస్థితి. అయితే సొంత కుంపట్లతో ఇబ్బందులు పడ్డ సర్కార్‌ ఇప్పుడు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ తీరుతో కక్కలేక మింగలేక అన్నట్లు విచిత్ర పరిస్ధితిని ఎదుర్కొంటోందట. మీనాక్షి వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణయాలు అటు తెలంగాణ కాంగ్రెస్‌కి, ఇటు ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారాయన్న ప్రచారం కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. మీనాక్షి రాక వల్ల పార్టీ బాగుపడుతుందన్న వాదన ఎలా ఉన్నా… ఇప్పుడు మాత్రం ఆమె చేస్తున్న కొన్ని చర్యల వల్ల ఇటు పార్టీకి అటు ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తున్నాయని సీనియర్ నేతలు సైతం అంగీకరిస్తున్నారట.

Also Read: NDL TDP President: నంద్యాల జిల్లా అధ్యక్ష రేస్‌లో ట్రయాంగిల్‌ ఫైట్‌

Meenakshi: ఇటీవల సచివాలయానికి మీనాక్షి రావడం పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. మంత్రివర్గ విస్తరణ జాప్యానికీ మీనాక్షే కారణమంటున్న ఆరోపణలు వినిపించాయి. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో మీనాక్షి కాస్త ఎక్కువ చేశారని విమర్శలొచ్చాయి. క్రమంగా మీనాక్షి వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువన్న ప్రచారం కాంగ్రెస్‌ వర్గాల్లో బలపడుతోంది. అధికారిక మీటింగులకు వెళ్లి, రిపోర్టులు తీసుకోవడం వరకూ ఓకే… కానీ మరీ శృతి మించి జిల్లాలు, నియోజకవర్గాల వారీగా మీటింగులు కూడా తనే పెడుతున్నారని, అదీకాక తమనే నిలదీస్తున్నారని వాపోతున్నారు కాంగ్రెస్‌ నేతలు. “తనకేమీ నష్టం లేదు. కానీ రేప్పొద్దున ఎన్నికల్లో నిలబడేది ఎవరు? కేసులు, ఖర్చులు, నష్టాలు, బాధలు భరించినవాళ్లకు తెలుసు అసలు సిట్యుయేషన్ ఎంటో” అంటూ చర్చించుకుంటున్నారట. “ఇది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఎంత మొత్తుకున్నా ఒరిగేది ఏమీ ఉండదు. పార్టీ పదవులు, అధికారిక పదవులకూ కొన్ని లెక్కలుంటాయి. మరి ఈ పెత్తనాల కొత్త ఒత్తిడి దేనికి పార్టీ మీద?” అంటూ పెదవి విరుస్తున్నారట. రాజకీయాల్లో ఆ వ్యయ ప్రయాసలేవో జనంలో ఉండేవాడికి తెలుస్తుంది కానీ, ఇలా అకస్మాత్తుగా వచ్చి అందరిపై స్వారీ చేయడం ఏంటని తమలో తాము మదనపడిపోతున్నారట. నిరాడంబరాలు, గాంధేయవాది ఎట్సెట్రా భుజకీర్తులు ఆమె వ్యక్తిత్వానికి వన్నె తేవొచ్చు కానీ.. వాటితో పార్టీకి ఏం ప్రయోజనం? అంటూ అంతర్గత సమావేశాల్లో మొహం చిట్లిస్తున్నారట హస్తం పార్టీ నేతలు.

ALSO READ  KCR: చరిత్ర తవ్వుతున్న బీజేపీ.. ఎక్కడికి దారితీస్తుందో..

Also Read: BRS MLC Kavitha: సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ

Meenakshi: పార్ఠీ వ్యవహారాలు చూడటానికి ఒక ఖర్గే, ఒక కేసీ వేణుగోపాల్, ఒక రాహుల్, ఒక సోనియా, శివకుమార్ వంటి వాళ్లు ఉన్నారనీ, పైగా స్థానిక కుల, ప్రాంత, మత, వర్గ సమీకరణాలు ఆలోచించి వ్యవహరించే పీసీసీ అధ్యక్షుడున్నాడనీ, ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నారనీ, వాళ్లను కాదని మీనాక్షి పెత్తనమేంటని అసహసం వ్యక్తం చేస్తున్నారట. వైఎస్ఆర్ పీరియడ్‌లో కూడా ఇన్‌చార్జులు ఉండేవాళ్లు, వచ్చేవాళ్లు, కేవీపీని కలిసేవాళ్లు.. సూట్‌కేసులు మోసుకుంటూ ఢిల్లీకి వెళ్లిపోయేవాళ్లు.. అంతేగానీ లేని పెత్తనాన్ని రుద్దే ప్రయత్నం చేయలేదనీ, కొత్తగా కాంగ్రెస్‌లో ఏదో చేసేద్దాం, అంతా మార్చేద్దాం అనుకుంటే మేడం గారి భ్రమేనని మాట్లాడుకుంటున్నారట. ఇప్పుడున్న స్థితిలో కర్నాటక కాంగ్రెస్‌ వట్టిపోయిందనీ, హర్యానా మొత్తానికే జీరో అయిందని.. కాస్తో కూస్తో పార్టీ మనీ వ్యవహారాలు చూసేది కేవలం తెలంగాణ మాత్రమేనని, అలాంటప్పుడు ఇక్కడి పార్టీకో, ప్రభుత్వానికో కాళ్లల్లో కట్టెపుల్లలు పెట్టడం దేనికి అన్నది మరికొందరి వాదన. ఈ తెలంగాణ జనం మనోభావాలు ఏమిటో, ఉద్వేగాలు ఏమిటో, అవసరాలు ఏమిటో, ఖజానా దుస్థితి ఏమిటో ఇక్కడి నేతలకు, ఇక్కడి ప్రభుత్వానికి తెలుస్తుంది. అంతే కానీ… హూ ఈజ్‌ షి? అంటూ విరుచుకుపడుతున్న పరిస్థితి కాంగ్రెస్‌లో అంతర్గతంగా కనబడుతోంది. మొత్తానికి కాంగ్రెస్‌లో వ్యవహారాలు చక్కబెట్టడం అంటే.. అంత ఈజీ టాస్క్‌ కాదన్నది ప్రసెంట్‌ ఎపిసోడ్‌తో మరోసారి ఫ్రూవ్‌ అవుతోందనమాట.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *