Singaiah Death Mystery

Singaiah Death Mystery: వైసీపీ డ్రోన్‌ విజువల్స్‌ ఏమయ్యాయి?

Singaiah Death Mystery: సింగయ్య మృతికి బాధ్యులెవరు? సింగయ్య ప్రమాదవశాత్తు కారు కింద పడ్డాడా? లేక జనం ఉన్నారని తెలిసి కూడా కారును వేగంగా నడిపించడం ప్రమాదం జరిగిందా? గాయపడిన సింగయ్యను పక్కకు లాగేసి ముందుకు వెళ్ళినా జగన్‌కు తెలియలేదా? సింగయ్య గాయపడిన విషయం జగన్‌కు తెలిసి కూడా ముందుకు వెళ్లారా? జగన్ పిటీషన్‌పై హైకోర్టులో ఇప్పటివరకూ జరిగిన వాద ప్రతివాదనలు ఏమిటి?

ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే జగన్‌పై కేసు పెట్టిందని జగన్ తరఫు న్యాయవాది వాదించారు. సింగయ్య అకస్మాత్తుగా కారు కింద పడిపోయారనీ, దుర్గారావు అనే సాక్షి ఇదే చెప్పారని కోర్టుకు వెల్లడించారు. వందల మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు తరలివచ్చారనీ… కాన్వాయ్ ఎడమ వైపు టర్న్ తీసుకోగానే అకస్మాత్తుగా సింగయ్య కారు ముందటి ఎడమ టైర్ కింద పడ్డారనీ, సింగయ్యను కారు కింద నుంచి పక్కకు తీసిన తరువాత కాన్వాయ్ వెళ్ళిపోయిందని, పోలీసులు వచ్చి అంబులెన్స్‌కు ఫోన్ చేశారని దుర్గారావు స్టేట్మెంట్ చెబుతోందని జగన్ న్యాయవాది వాదించారు. ఇందులో జగన్ నిర్లక్ష్యం ఎక్కడ ఉంది? జగన్ ఎక్కడ ప్రోత్స హించారు? జగన్‌కు తెలుసు అని ఎక్కడ చెప్పగలం? అంటూ ప్రశ్నలు లేవనెత్తారు జగన్‌ తరఫు న్యాయవాది. పోలీసులు మొదట ఒకటి చెప్పి, తర్వాత ఉద్దేశపూర్వకంగా కేసును పక్కదారి పట్టించి, చివరకు జగన్‌ను ఇరికించేలా కేసును మార్చారని, కారును స్పీడ్‌గా నడపడమే సింగయ్య మరణానికి కారణమని చెబుతూ, ఇందుకు ఏ1 నుంచి ఏ6 వరకూ బాధ్యులని చేస్తూ కేసును మార్చేశారని జగన్ న్యాయవాది చెప్పారు.

Also Read: PM Modi: ప్రధాని మోదీకి ట్రినిడాడ్ అండ్‌ టొబాగో అత్యున్నత పురస్కారం

Singaiah Death Mystery: అయితే జగన్‌ న్యాయవాది లేవనెత్తిన ప్రశ్నలకు ధీటుగా బదులిచ్చారు అడ్వొకేట్‌ జనరల్‌. ప్రతి సమాచారాన్ని మదింపు వేయాల్సి ఉందన్నారు. మరింత మెటీరియల్ సమర్పించడానికి వారం లేదా 2 వారాలు గడువు ఇవ్వాలని కోరిన ఏజీ… పిటీషనర్ జగన్మోహన్‌రెడ్డి ఎప్పుడూ నిబంధనలు ఫాలో కాలేదన్నారు. వందల మంది ఉన్నారనే అవగాహన ఉన్నా నిర్లక్ష్యంగా, రాష్‌గా జగన్‌ డ్రైవర్‌ కారు డ్రైవ్ చేశారనీ, గాయపడిన సింగయ్య విషయాన్ని పోలీసులకూ తెలుపకపోవడం నేరమేనని వాదించారు. వైసీపీ కూడా తమ అధినేత పర్యటన విజువల్స్‌ని డ్రోన్ ద్వారా చిత్రీకరించిందని, అందులో మరిన్ని ఆధారాలు లభ్యమవుతాయని, ఆ డ్రోన్ వీడియో ఇంకా సేకరించాల్సి ఉందని ఏజీ సంచలన విషయం బయటపెట్టారు. కేసుకు సంబంధించిన మరింత సోదాహరణంగా సమాచారాన్ని అందించడానికి సమయం కావాలని అడ్వకేట్ జనరల్ కోరడంతో… కేసు విచారణను వాయిదా వేశారు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాస రెడ్డి.

ALSO READ  Perni Nani: ఇప్పటికీ అజ్ఞాతంలోనే మాజీ మంత్రి పేర్ని నాని ఫ్యామిలీ

సింగయ్య మృతిలో జగన్‌మోహన్‌రెడ్డి తప్పు లేనట్లయితే… తమ సచ్ఛీలతని నిరూపించుకునేందుకు వైసీపీ ఇప్పటికే తాము చిత్రీకరించిన డ్రోన్‌ విజువల్స్‌ని రిలీజ్‌ చేసి ఉండాలి కదా? అసలు డ్రోన్‌ ద్వారా విజువల్స్‌ చిత్రీకరించిన విషయాన్ని ఎందుకు తొక్కిపెట్టారు? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ… జగన్ తాడేపల్లి ప్యాలెస్‌ ముందు మంటలు చెలరేగిన ఘటన చోటు చేసుకున్నప్పుడు.. ప్యాలెస్‌ ముందు అమర్చిన సీసీ కెమెరాల పుటేజీని పోలీసులకు ఇవ్వకుండా వైసీపీ మొండికేసింది. సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ.. వాటికి కనెక్షన్‌ లేదంటూ ఏవేవో చెప్పుకొచ్చింది. ఇప్పుడు సింగయ్య మృతికి సంబంధించి డ్రోన్‌ కెమెరా విజువల్స్‌ని కూడా దాచిపెడుతోందా? అన్న సందేహం కలుగుతోంది. ఏది ఏమైనా పోలీసులు ఆ డ్రోన్‌ వీడియోని సేకరిస్తే కనుక… వైసీపీ తమ చేత్తో తమ కన్ను తామే పొడుచుకున్నట్లుగా కేసు సంచలన మలుపు తిరిగే అవకాశం ఉంది అంటున్నారు విశ్లేషకులు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *