SaiReddy Deadly Warning: లిక్కర్ స్కామే లేదని జగన్ రెడ్డి అంటున్నారు.. మళ్లీ నేను లిక్కర్ స్కాంలో రహస్యాలు చెప్పడానికి టీడీపీ నేతలతో కలిశానని ప్రచారం చేస్తున్నారు.. ఏం లేనప్పుడు ఏం చెబుతానని సాయిరెడ్డి వైసీపీ నేతల్ని ప్రశ్నించారు. టీడీ జనార్దన్‌తో విజయసాయిరెడ్డి రహస్య సమావేశం అయ్యారని.. ఆయన చంద్రబాబు వద్ద లొంగిపోయారనడానికి ఇంత కంటే సాక్ష్యం ఏం కావాలని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇందుకు సాక్ష్యంగా ఓ వీడియో రిలీజ్ చేశారు. దీనిపై విజయసాయిరెడ్డి కాస్త టైమ్ తీసుకున్నప్పటికీ.. ఇవ్వాల్సిన విధంగానే కోటింగ్ ఇచ్చేశారు. తనను గెలుక్కుంటే అసలు నష్టం జగన్ రెడ్డికే అని సూటిగా, సుత్తి లేకుండా చెప్పారు.
సాయిరెడ్డి అమ్ముడుపోయాడు, అతని మాటలకు వ్యాల్యూ ఏముంటుంది అంటూ నేరుగా విజయసాయిరెడ్డి పేరు ప్రస్తావిస్తూ జగన్ రెడ్డి చేసిన విమర్శలకు… నిదానంగా, నిబ్బరంగా, కాస్తంత సమయం తీసుకుని మరీ స్పందించిన సాయిరెడ్డి.. సావధానంగా చావకొట్టారు. తనకు సంబంధం లేని స్కాముల్లో మరోసారి తనని బలి పశువును చేద్దామని కోటరి నిర్ణయించుకున్నందు వల్లే పార్టీ నుండి బయటకొచ్చానన్నారు విజయసాయిరెడ్డి. 2011లో తనపై నమోదైన ఇరవైయొక్క కేసులు కూడా.. అలా మీద వేసుకున్నవే అంటున్నారు. నిజంగా అన్నన్ని కేసులు తనవి కాకున్నా తన మీదేసుకున్నారంటే.. ప్రపంచంలో విజయసాయిరెడ్డి అంతటి మంచివాడు, అమాయకుడు మరొకడు లేడని చెప్పొచ్చు. అది పక్కన పెడితే.. 2025లో కూడా జగనే అడిగి ఉంటే కాదనకుండా కేసులు మోసే వాడినని, కానీ కోటరీ ద్వారా రుద్దే ప్రయత్నం చేయడం తనకు నచ్చలేదని చెప్పుకొచ్చారు సాయిరెడ్డి. నీ కేసులు నెత్తినేసుకుంటే సాయిరెడ్డి మంచోడు, లేదంటే చెడ్డోడు అవుతాడా? అంటూ జగన్‌ని సూటిగా ప్రశ్నించారు సాయిరెడ్డి.
తాను ఘట్టమనేని ఆది శేషగిరిరావుగారి ఇంటికి వెళ్లింది నిజమేనని, అదే సమయంలో టీడీపీ నేత టీడీ జనార్ధన్ వారింటికి వస్తున్న విషయం తనకు తెలియదన్నారు విజయసాయిరెడ్డి. తమ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదనీ, తాను ఈ జన్మకు టీడీపీలో చేరటం లేదని ముందే చెప్పానన్నారు. కలవాలని అనుకుంటే డైరెక్ట్‌గా లోకేష్‌నో, చంద్రబాబునో కలుస్తాకానీ.. మధ్య వర్తులతో చర్చించనన్నారు. లిక్కర్ స్కామే లేదని జగన్ అంటుంటే, ఆ స్కాం రహస్యాలు టీడీపీతో మాట్లాడటానికి తాను ఆ పార్టీ నాయకుల్ని కలిశానంటూ జగన్ కోటరీ ఆరోపిస్తోందనీ.. దీన్నిబట్టి లిక్కర్ స్కామ్ జరిగినట్లు జగన్ కోటరీనే ఒప్పుకున్నట్లు అయ్యిందనీ, జగన్‌ను ఎప్పటికైనా జైలుకు పంపందే ఆ కోటరీ నిద్రపోదనీ ఇండైరెక్ట్‌గా తేల్చిచెప్పారు సాయిరెడ్డి.
Also Read: Mahanadu 2025: ఆడపిల్లల గురించి తప్పుగా మాట్లాడితే తాటతీస్తా..సీఎం చంద్రబాబు
SaiReddy Deadly Warning: విజయసాయిరెడ్డి ఇప్పటికీ జగన్‌ని సేఫ్ చేయడానికే ప్రయత్నిస్తున్నాడనీ, ఆయన కోపమంతా తనని పార్టీ నుండి తరిమేసి, తన స్థానాన్ని ఆక్రమించిన సజ్జల వంటి కోటరీపైనే అని.. ఇప్పటిదాకా సాయిరెడ్డి స్టేట్మెంట్లు పరిశీలిస్తే అర్థమౌతుంది. జగన్ తనకు తెలిసి చేసిన అవినీతే కాదు.. తనకి తెలీకుండా చేసిన అక్రమాల గురించి కూడా సాయిరెడ్డికి పూసగుచ్చినట్లు తెలుసు. ఆయన తలుచుకుంటే.. చిత్రగుప్తుడిలా కూర్చుని పేజీలకు పేజీలు జగన్ పాపాల చిట్టా రాసి, బయటపెట్టగలడు. సాయిరెడ్డి తన తాజా రియాక్షన్‌లో ఇండైరెక్ట్‌గా జగన్‌ని, డైరెక్ట్‌గా జగన్ కోటరీని వార్న్ చేస్తోంది కూడా ఇదే. ఒక రకంగా సాయిరెడ్డిది వార్నింగ్ కాదు. అంతకు మించి అంటున్నారు పరిశీలకులు. మరి అంతటి ప్రమాదకరమైన విజయసాయిరెడ్డి పట్ల జగన్ ఎందుకు అప్రమత్తంగా లేరన్నది అందరికీ వస్తోన్న అనుమానం. సాయిరెడ్డి చెప్తోన్న కోటరీనే… జగన్‌ను తప్పుదారి పట్టిస్తోందా? జగన్‌ని జైలుకు పంపే కుట్రలు ఆయన కోటరీ నుండే జరుగుతున్నాయా? అందుకే విజయసాయిరెడ్డిని రెచ్చకొడుతున్నారా? అన్న సందేహాలకు ఇప్పటికైతే సమాధానాలు లేవు.