Pawan Style vs Jagan Politics: వెళ్తే వెళ్లారని, వెళ్లకుంటే వెళ్లలేదని. చంద్రబాబు, పవన్ ఫీల్డ్ ఇన్స్‌పెక్షన్‌పై వైసీపీ గగ్గోలు పెడుతోన్న తీరిది. మొంథా తుపాన్ నొప్పి లేకుండా కోస్తాని కోత కోసింది. ప్రభుత్వం ముందస్తు చర్యలతో ప్రాణ నష్టం అయితే నివారించగలిగింది కానీ… మొంథా విధ్వంసం, ముఖ్యంగా రైతుకు గుండె కోత మాత్రం తప్పలేదు. వేధనలో ఉన్న రైతాంగాన్ని ఓదార్చేందుకు.. నిన్న కోనసీమలో చంద్రబాబు పర్యటిస్తే, నేడు దివిసీమకు వెళ్లారు పవన్. ఫీల్డ్‌కు వెళ్లి నేరుగా రైతుల్ని కలిసి, వారి కష్టం విని, నష్టాన్ని కళ్లారా చూసి, రేపటిపై భరోసాని నింపారు సీఎం, డిప్యూటీ సీఎంలు. అయితే జగన్ మాత్రం తుపాన్ వెళ్లిపోయాక తాపీగా తాడేపల్లికి చేరుకున్నారు. ఒకరోజు విశ్రాంతి తీసుకుని, రెండో రోజు ప్యాలస్ నుండే జూమ్ మీటింగ్ కండక్ట్ చేశారు. మొంథా ధాటికి రాష్ట్రం 24 గంటలు అల్లాడిపోయింది. అటు ఇటు రెండ్రోజులు ఊపిరి బిగబట్టి, కష్టాన్ని ఎదుర్కొంది. రాష్ట్రం ఇంత కష్టంలో ఉన్నప్పుడు కూడా.. తాను చేసింది ఏదీ లేకున్నా కూడా.. కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతూ జగన్ ఓ మాటన్నారు చూశారా.. అదీ హైలెట్. అలవోకగా ‘ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్’ అంటూ తేల్చేశారు. జగన్‌కు మించి రెండాకులు ఎక్కువ చదివిన ఆయన సొంత మీడియా.. ఇది ‘చంద్రబాబు ప్రచార విపత్తు’ అంటూ జనాన్ని నమ్మించడానికి రెండ్రోజులుగా గొంతు చించుకుంటోంది.
Also Read: NDA Manifesto: కోటి ప్రభుత్వ ఉద్యోగాలు.. బీహార్ ఎన్నికల కోసం ఎన్డీయే మేనిఫెస్టో
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సంబంధిత శాఖా మంత్రులు ఆర్టీజీఎస్‌లో తుపాన్‌ని మానిటరింగ్ చేస్తే.. అది షోయింగ్ అన్నారు. ఫీల్డ్‌కెళ్లి రైతుల కష్టాలు తెలుసుకుంటే అది ఫొటో షూట్ అన్నారు. తుపాన్ విపత్తులోనూ వికృత రాజకీయాలు మానట్లేదు విపక్ష వైసీపీ. ఈ వైసీపీకి రాజకీయం తప్ప రైతుల బాధలు అక్కర్లేదా? అని ప్రశ్నిస్తున్నారు కామన్ సెన్స్ ఉన్న ప్రజలు. విపత్తు సమయాల్లో సీఎం అనే వాడు పర్యటించకూడదంటూ గతంలో జగన్ ఓ థియరీ చెప్పారు. సాక్షాత్తూ అసెంబ్లీ సాక్షిగానే ఆ సిద్ధాంతాన్ని ప్రవచించారు అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. తుపాన్ సమయాల్లో సీఎం పర్యటనకు వెళ్తే హడావుడి తప్ప ప్రయోజనం ఉండదన్నారు. పర్యవేక్షణ మాత్రమే చేయాలన్నారు. తుపాన్ వచ్చిన రోజు 24 గంటల పాటు సీఎం చంద్రబాబు చేసింది అదే. కానీ చంద్రబాబు ఏమైనా నాసా సైంటిస్టా? కంప్యూటర్ ముందు కూర్చుంటే వచ్చే తుపాన్ రాకుండా పోతుందా? అంటూ దిగజారి గేలి చేసింది జగన్ మీడియా. అలా జగన్ చేసే రాజకీయానికి, ఆయన మీడియా చేసే అతికి ఎక్కడా పొంతనే ఉండదు.
ఇక లేటు పరామర్శలు, రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారు జగన్. బెంగళూరులోనే ఎక్కువ సమయం గడుపుతూ, ఏపీలో పార్ట్‌టైం రాజకీయం చేస్తున్నారు. 17 నెలల్లో రాజకీయ పరామర్శల్నే నమ్ముకున్నారాయన. విశాఖకు గూగుల్ వస్తున్న విషయంలో మొదట వైసీపీ నేతలు, దాని మీడియా విష ప్రచారం చేస్తే జగన్ ఎక్కడున్నారో కూడా తెలీదు. సడన్‌గా మీడియా ముందుకొచ్చి, ప్లేటు ఫిరాయించి, గూగుల్ క్రెడిట్ తనదేనంటూ కొత్త రాగం అందుకున్నారు. నేడు తుపాన్ వెళ్లిపోయాక తాపీగా ఏపీకొచ్చిన జగన్.. ఏసీ రూంలో తుపాన్ కలిగించిన నష్టాన్ని అంచానా వేశారు. జూమ్ మీటింగ్ పెట్టి నేతలకు దిశానిర్దేశం చేశారు. ఒక రకంగా జగన్ అలా చేయడమే బెటర్ అయ్యింది అంటున్నారు రాష్ట్ర శ్రేయస్సు కాంక్షించే పలువురు. ఆయన వచ్చీ రాగానే ఎక్కడ ఓదార్పు యాత్ర అంటూ రాష్ట్రం మీద, రైతుల మీద పడిపోతాడో అని భయపడ్డవారంతా… జగన్ జూమ్ మీటింగ్‌కి పరిమితం అవ్వడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఎందుకంటారా… 17 నెలలుగా ఆయన చేసిన పరామర్శ యాత్రలన్నీ ఒకసారి గమనిస్తే… బాధితులకు మేలు జరగాలి అనే విధంగా కన్నా సొంత రాజకీయ లబ్ధికే ఆరాట పడ్డారు జగన్ మోహన్ రెడ్డి. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కన్నా ఫేక్ ప్రచారాలకే మొగ్గు చూపుతోంది ఆయన పార్టీ. మొత్తానికి నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతోంది వైసీపీ. అందుకే వైసీపీకి రాజకీయాలు చేయడం చేతకావట్లేదన్న విమర్శ అంతటా వినబడుతోంది.


