Krishnam Raju Approver: వైసీపీ అధినేత జగన్‌కు చెందిన సాక్షి మీడియాలో అమరావతి రాజధానిని “వేశ్యల రాజధాని” అని వివాదాస్పదంగా వ్యాఖ్యానించిన కేసులో సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు అప్రూవర్‌గా మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన తప్పును తెలుసుకుని, పశ్చాత్తాపంతో ఆయన పోలీసుల ముందు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. అమరావతి మహిళలకు క్షమాపణ చెబుతూ త్వరలో ఓ వీడియో కూడా విడుదల చేస్తానని, తనకు అప్రూవర్‌గా మారే అవకాశం కల్పించాలని తుళ్లూరు డీఎస్పీ మురళీ కృష్ణను ఆయన కోరినట్లు ప్రచారం జరుగుతోంది.
మూడు రోజుల పాటు అమరావతిలోని తుళ్లూరు పోలీసులు కృష్ణంరాజును విచారించారు. మొదటి రోజు సమాధానాలు చెప్పకుండా తప్పించుకున్న ఆయన… రెండో రోజు, మూడో రోజు విచారణలో పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో లొంగిపోయారట. సీనియర్ జర్నలిస్టునైన తనకు స్వతహాగా గుర్తింపు లేదని, తనని గుర్తించింది ఒక్క సాక్షి మీడియా మాత్రమే అని చెప్పొకొచ్చారట కృష్ణం రాజు. 1995 నుండి 2004 మధ్య కాలంలో చంద్రబాబు ప్రభుత్వం తనను ఇబ్బంది పెట్టిన కారణంగా… ఆయనకు వ్యతిరేకంగా మారినట్లు చెప్పారట కృష్ణం రాజు. ఓ పత్రికలో పనిచేస్తున్నప్పుడు చంద్రబాబును విమర్శించినందుకు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురైనట్లు, అప్పటి నుంచి చంద్రబాబుపై కక్ష పెంచుకున్నట్లు వెల్లడించారట. అయితే సాక్షి యాజమాన్యం తన బలహీనతను గుర్తించి, పావుగా వాడుకుందని పోలీసుల ముందు వాపోయారట జర్నలిస్టు కృష్ణంరాజు.
అమరావతి మహిళలపై వ్యాఖ్యలకు ముందు రోజు సాక్షి నుంచి తనకు కొంత సమాచారం అందిందని, మరుసటి రోజు జరిగే డిబేట్‌లో ఏ లైన్‌లో మాట్లాడాలో అజెండా సెట్ చేశారని కూడా కృష్ణం రాజు వెల్లడించారట. వాళ్లు చెప్పిన ప్రకారమే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్న కృష్ణం రాజు… తన తప్పు తెలుసుకున్నాననీ, అమరావతి మహిళలకు క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఏ1గా ఉన్న కృష్ణంరాజు అప్రూవర్‌గా మారితే, సాక్షి మీడియాపై కఠిన చట్టాల కింద కేసు నమోదయ్యే అవకాశం ఉంది.
Also Read: Sharmila: ప్రశ్నించే ధైర్యం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది
Krishnam Raju Approver: కృష్ణంరాజు అప్రూవర్‌గా మారితే, జగన్ సొంత మీడియా తమ రాజకీయ లక్ష్యాల కోసం జర్నలిస్టులను ఎలా పావులా వాడుకుందనే విషయాలు బహిర్గతమయ్యే అవకాశం ఉంది. దాంతో ఈ కేసు ఏపీ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టించే అవకాశం కనబడుతోంది. అదే జరిగితే సాక్షి మీడియా చట్టపరమైన చిక్కులు ఎదుర్కోక తప్పదని, సూత్ర ధారులపై కూడా దర్యాప్తు వేగం పుంజుకోవచ్చని చెబుతున్నారు పరిశీలకులు. అయితే, కృష్ణంరాజు వెల్లడించిన విషయాలు న్యాయస్థానంలో ఎంతవరకు నిలబడతాయనేది కీలకం.
కృష్ణంరాజు కేసు ఎలక్ట్రానిక్ మీడియాలో విశ్లేషకుల నీతి, వారి వెనుక రాజకీయ ఒత్తిళ్లపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ కేసు మీడియా స్వేచ్ఛ, రాజకీయ పక్షపాతం మధ్య సంక్లిష్ట సంబంధాన్ని మరోసారి బహిర్గతం చేసింది.