Jagan Assembly Fear

Jagan Assembly Fear: అడకత్తెరలో పోక చెక్కలా మారిన జగన్‌ పరిస్థితి..!

Jagan Assembly Fear: వై నాట్‌ 175 అన్న వైసీపీ… ఉన్న 151లో మిడిల్‌లో 5 నంబర్‌ ఎగిరిపోవడంతో 11 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. శాసనసభ నియమావళి, నిబంధనల ప్రకారం.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాకు కావాల్సిన 18 సీట్లు లేకున్నా.. హోదా ఇవ్వాల్సిందే అంటూ మారాం చేస్తోంది. వైసీపీ ఎంత మారాం చేసినా సరే స్పీకర్ నిరాకరించారు. హోదా ఇవ్వడానికి మేమెవరం.. అది ప్రజలివ్వాలి అంటూ తేల్చి చెబుతోంది కూటమి ప్రభుత్వం. దీంతో ఇది ప్రజాస్వామ్యాన్ని గొడ్డలితో ఖూనీ చేయడమేనని, తమ గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని జగన్ తీవ్రంగా విమర్శించారు. ఇదే మంచి సాకు అనుకుని పనిలో పనిగా అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు కూడా ప్రకటించారు. సోషల్‌మీడియాలో వైసీపీ క్యాడర్‌ ఊరికే ఉంటుందా? అసెంబ్లీని బహిష్కరించడమే పెద్ద ధైర్య సాహసాలు అన్నట్లు జగన్‌మోహన్‌ రెడ్డిని కీర్తించింది వైకాపా క్యాడర్‌. అక్కడే జగన్‌ పంతం పుట్టుకొచ్చింది. ప్రజాస్వామ్యం అన్నా, సభా సంప్రదాయాలు అన్నా పెద్దగా పట్టింపులేని జగన్‌ రెడ్డి.. అసెంబ్లీకి వెళ్లేది లేదని పంతానికి పోయారు కానీ… దాని పర్యవసానాలను ఆనాడు లెక్కపెట్టుకోలేదు. ఇప్పుడు పంతం పట్టుకుని కూర్చుకుంటే ఉన్న పదవి కాస్తా ఊడుతుంది. పంతాన్ని వదులుకుంటే పరువు పోతుంది. అడకత్తెరలో పోక చెక్కలా మారింది జగన్‌ రెడ్డి పరిస్థితి.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం, సభ అనుమతి లేకుండా ఒక సభ్యుడు వరుసగా 60 సమావేశ దినాలు గైర్హాజరైతే, ఆ సభ్యుడి స్థానాన్ని ఖాళీగా ప్రకటించే అధికారం సభకు ఉంటుంది. అంటే, జగన్ తన బహిష్కరణను ఇలాగే కొనసాగిస్తే, ఆయన తన శాసనసభ్యత్వానికే దూరం కావాల్సి వస్తుంది. ఇది ప్రతిపక్ష హోదా కోల్పోవడం కన్నా చాలా పెద్ద రాజకీయ నష్టం. పులివెందుల ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని, ఇచ్చిన తీర్పును కూడా అగౌరవపరిచినట్టు అవుతుంది. ఇప్పటికే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు చూసిన పులివెందుల ప్రజలు.. జగన్‌కి ఓటు వేయకుంటే పులివెందులలో భూకంపం ఏమీ రాదని, జగన్‌కి ఓటు వేసినా, వేయకున్నా తమ బతుకులు తాము స్వేచ్ఛగా బతకొచ్చని, దాన్నే ప్రజాస్వామ్యం అంటారని అర్థం చేసుకున్నారు. దీంతో పులివెందులలో ఉప ఎన్నిక అంటూ వస్తే రిజల్ట్‌ ఎలా ఉండనుందో జగన్‌కి కూడా తెలిసొచ్చింది. పంతం కోసం పదవిని పణంగా పెట్టడం రాజకీయంగా ఆత్మహత్యా సదృశం అని విజ్ఞులు సలహాలు ఇస్తుండటంతో జగన్‌ పునరాలోచనలో పడ్డారని పులివెందుల వర్గాల్లో టాక్‌ నడుస్తోంది.

Also Read: Nepal: నేపాల్‌లో రాజకీయ సంక్షోభం: ప్రధాని ఓలీ రాజీనామా, సైన్యం చేతుల్లోకి పగ్గాలు?

Jagan Assembly Fear: తాను వెళ్లకుండా మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు సభకు వెళ్లినా జగన్‌ రెడ్డే మాట పడాల్సి వస్తుంది. సొంత ఎమ్మెల్యేలే జగన్‌ని లెక్క చేయడం లేదన్న అప్రతిష్ట మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు జగన్‌కి తెలీకుండా దొంగచాటుగా సంతకాలు పెట్టి వెళ్లారన్న విషయం బయటకు పొక్కడంతో ఆ పార్టీ పరువు పోగొట్టుకుంది. తాను వెళ్లక, మిగతా వారిని వెళ్లనివ్వక.. భీష్మించుకుని కూర్చుంటే.. తనతో పాటూ మిగతా పది మంది ఉద్యోగాలు ఊడగొట్టిన ఘనత కూడా జగన్‌కే దక్కుతుంది. అందువల్ల… పంతం కన్నా పదవిని, రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే జగన్‌ మొగ్గు చూపే అవకాశం ఉందని పరిశీలకులు భావించారు. ఆయన అసెంబ్లీకి తిరిగి రావడం అనివార్యం అని అంచనా వేశారు. అయితే సడన్‌గా సజ్జల ఎంట్రీ ఇచ్చి ట్విస్ట్‌ ఇచ్చారు. అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా అంటూ సీఎం చంద్రబాబు సవాల్‌ విసిరితే… మా జగన్‌కి హోదా ఇచ్చేందుకు సిద్ధమా అంటూ సజ్జల కొత్తరకం బార్గెయినింగ్‌ మొదలు పెట్టారు. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది.

ఒక వేళ ఉప ఎన్నికలకు వెళ్లాలని జగన్‌ యోచిస్తున్నారా? అలా వెళ్తే ఉన్న 11 సీట్లలో నాలుగో, ఐదో మిగులుతాయి తప్ప… 18 సీట్లకు పెరిగే అవకాశం లేదు కదా! మరి ఉప ఎన్నికలకు వెళ్లి జగన్‌ సాధించేది ఏమిటి? 11 సీట్లలో మునుపటి కంటే భారీ మెజార్టీలతో గెలిచి ప్రజా తీర్పు తమ వైపే ఉందని చాటి చెప్పాలనుకుంటున్నారా? ఫాదర్‌ సెంటిమెంట్‌ నడిచిన కొత్తల్లో, తల్లీ చెల్లి వెంట నడిచిన రోజుల్లో జగన్ ఆ తరహా రాజకీయం చేయగలిగారు కానీ… ఇప్పట్లో సాధ్యం అవుతుందా? జగన్ ఆటలు సాగటానికి ఇప్పుడున్న చంద్రబాబు మునుపటిలా లేరు. ఇప్పుడున్నది ఒకప్పటి మెతక ప్రభుత్వమూ కాదు. పవన్‌, మోడీల సపోర్టుతో నడుస్తున్న సరికొత్త కూటమి ప్రభుత్వం. మరి జగన్ ముందున్న రెండే రెండు దారుల్లో ఆయన ఎటు తేల్చుకుంటారో వేచి చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *