Gummanur Jayaram Controversy: అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలో టిడిపి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, వైసిపి మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. మాటలు తారస్థాయికి చేరడంతో పాటు, గుంతకల్‌లో ఇప్పుడు రాజకీయం గాడి తప్పుతోంది. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న గుంతకల్ నియోజకవర్గంలో ఇప్పుడు అలజడి మొదలైంది.
గుమ్మనూరు జయరాం కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి. గత వైసిపి ప్రభుత్వంలో ఆలూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ, మంత్రిగా పని చేశారు. ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే సీటు కేటాయించలేదు. ఈ నేపథ్యంలో వైసిపి నుండి టిడిపిలో చేరారు. గుమ్మనూరు జయరాం వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో, గుంతకల్ నియోజకవర్గంలో బీసీ సామాజికవర్గ ఓట్లు ఎక్కువగా ఉన్న తరుణంలో, అక్కడ బలమైన నేత లేకపోవడంతో, గుంతకల్ నియోజకవర్గం నుండి టిడిపి తరఫున బరిలోకి దించారు. అప్పటికే వైసిపి పాలనపై విరక్తి చెంది ఉన్న ప్రజలు, జయరాం అనంతపురం జిల్లా వ్యక్తి కాకపోయినప్పటికీ, కూటమి అభ్యర్థిగా బరిలో ఉండడంతో అతనికే పట్టం కట్టి ఎమ్మెల్యేగా గెలిపించారు. అయితే ఎమ్మెల్యేగా జయరాం గెలిచిన తర్వాత సొంత పార్టీలోనే తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారట. ఎందుకు ఓటు వేసి గెలిపించుకున్నామా అన్న ధోరణిలో ఉన్నారట క్యాడర్. దశాబ్దాలుగా టిడిపిని నమ్ముకుని పార్టీ బలోపేతం కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టి, తనకు అనుకూలమైన వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, తన సొంత సామాజిక వర్గ వ్యక్తులకే పెద్దపీట వేస్తున్నాడని విమర్శలు కూడా ఉన్నాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, తాము ప్రతిపక్ష పార్టీలోనే ఉన్నట్టుగా ఉందట అక్కడ వ్యవహారం. అసలు మా పార్టీ ఎమ్మెల్యేనేనా గెలిచింది? అనే సందిగ్ధంలో ఉన్నారట అక్కడ టీడీపీ శ్రేణులు.
గుంతకల్ నియోజవర్గంలో ఎమ్మెల్యే కుటుంబ పాలన కొనసాగుతోందన్న విమర్శ వ్యక్తమవుతోంది. గుంతకల్ నియోజవర్గంలో ఇప్పుడు అంతా ఎమ్మెల్యే కుమారుడు గుమ్మనూరు ఈశ్వర్ హవా నడుస్తోందట. ఎమ్మెల్యే స్థానికంగా లేకపోవడం, ఏవైనా పార్టీ కార్యక్రమాలు ఉంటే తప్ప నియోజవర్గంలో కనిపించడం లేదట. పామిడి, గుత్తి మండలాల ఇన్‌చార్జిగా ఎమ్మెల్యే తన కుమారుడు ఈశ్వర్‌ని నియమించాడు. గుంతకల్ రూరల్, అర్బన్‌కి తన సోదరులు నారాయణస్వామి, శ్రీనివాసులను ఇన్‌చార్జిలుగా పెట్టారు. ఎవరికైనా ఏదైనా సమస్య ఉందంటే ఇన్‌చార్జిల దగ్గరికి వెళ్లాల్సిందేనట. వారు ఏమి చెబితే అదే నడుస్తోందట. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే అధికారులు ఎమ్మెల్యే కుమారుడు చెప్పిన మాటే వినాలట. చివరకు పోలీస్ స్టేషన్‌లో పని జరగాలన్నా ఎమ్మెల్యే కుమారుడు చెబితేనే అక్కడ పని జరుగుతుందని పెద్ద ప్రచారమే జరుగుతోంది. కేసులు పెట్టాలన్నా, కేసులు తీయాలన్నా, ఎవరిపై పెట్టాలి, ఎవరిపై పెట్టకూడదు అనేది కూడా షాడో ఎమ్మెల్యేగా గుమ్మనూరు ఈశ్వరే నిర్ణయిస్తారట. పామిడి పెన్నా నదిలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ దందా జరుగుతుందని ఆరోపణలు వస్తున్నాయి. అంతా ఎమ్మెల్యే కుమారుని కనుసన్నుల్లోనే నడుస్తుండటంతో అధికారులు కూడా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. సింగనమల నుంచి జేసీబీల సహాయంతో నదిలోని ఇసుకను టిప్పర్ల ద్వారా ఒక చోట డంపింగ్ చేసి, అక్కడ నుంచి కర్ణాటక రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి.
Also Read: TTD Parakamani Theft Case: పరకామణి చోరీ కేసు అసలు ఎటు వెళుతోంది?
ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేరు చెప్పుకొని కొందరు అనుచరులు నియోజవర్గ పరిధిలోని మండలాల్లో కొండలు, గుట్టలను తవ్వి… పెద్ద ఎత్తున ఎర్రమట్టిని తరలిస్తూ, లక్షలది రూపాయల దోచుకుంటూ, సహజ సంపదను కొల్లగొడుతూ, వారు ఆడింది ఆటగా, పాడింది పాటగా ఉందట పరిస్థితి. దందాలు, సెటిల్మెంట్లు చేస్తూ టిడిపికి చెడ్డ పేరు తెస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. నియోజవర్గ వ్యాప్తంగా మద్యం ఏరులై పారుతోందని, పెద్ద ఎత్తున బెల్ట్ షాపులకు తెరలేపి, ఎమ్మార్పీ ధర కన్నా అధిక ధరలకు విక్రయిస్తూ మందుబాబులకు అడుగడుగునా మద్యం అందుబాటులోకి తెచ్చారని చెప్పుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలు.
గుంతకల్ ఎమ్మెల్యే జయరాంపై మరో వివాదం రాజుకుంది. మరోసారి ఆయన రైతులను బెదిరించడం, రైతు నాయకులను తీవ్రస్థాయిలో హెచ్చరించడం వంటివి రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. కర్నూలు జిల్లాలో ప్రైవేటు కంపెనీకి భూములు ఇవ్వాలని రైతులపై స్థానిక అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. దీనిని ప్రజాసంఘాలతో కలిసి రైతులు వ్యతిరేకిస్తున్నారు. కొన్నాళ్లుగా అక్కడ ఉద్యమ స్థాయిలో నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకున్న గుమ్మనూరు జయరాం, సదరు కంపెనీకి అనుకూలంగా మాట్లాడుతూ రైతులపై తీవ్రస్థాయిలో దుర్భాషలు, బూతులతో విరుచుకుపడ్డారట. దీనిని ఖండిస్తూ సీపీఎం నేత, రైతు సంఘాల తరఫున ఎమ్మెల్యే జయరాంతో మాట్లాడారని, ఈ సందర్భంగా జయరాం ఆయనపై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడి, “నీ అంతు చూస్తాను, నిన్ను లేపేస్తాను” అంటూ బెదిరింపులకు దిగారన్న చర్చ ఇప్పుడు స్థానికంగా వివాదం రేపింది. ఈ వ్యవహారంపై కమ్యూనిస్టు సంఘాలు, ఉద్యమకారులు కూడా ఎమ్మెల్యే తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, ఎమ్మెల్యేను కట్టడి చేయాలని వారు కోరుతున్నారు.
ఎమ్మెల్యే వ్యవహార శైలి మార్చుకోకపోతే, రాబోయే పంచాయితీ, మున్సిపల్ ఎన్నికలపై ఇంఫాక్ట్ పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వర్గ పోరుకి చెక్ పెట్టి, అందర్నీ కలుపుకొని ముందుకు వెళితే తప్ప, లోకల్ ఎన్నికల్లో గట్టెక్కలేరని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా మూడు సంవత్సరాలు ఎలా గడిచిపోతాయోనని ఎదురుచూస్తున్నారట.

