Chevireddy: ఏపీ లిక్కర్ కుంభకోణం కేసు సంచలన మలుపు తిరిగింది..! మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని సిట్ నిందితుడిగా చేర్చింది. A38 నిందితుడిగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి, కోర్టులో మెమో దాఖలు చేసింది. బెంగళూరు ఎయిర్‌పోర్టులో లుకౌట్ నోటీసు కారణంగా అడ్డుకోబడిన చెవిరెడ్డి, విదేశాలకు పారిపోయే ప్రయత్నంలోనే దొరికిపోయాడన్న చర్చ నడుస్తోంది. బెంగళూరు ఎయిర్‌పోర్ట్ అధికారుల సమాచారం మేరకు మంగళవారం విజయవాడ నుంచి బెంగళూరు బయలుదేరి వెళ్లిన సిట్ బృందం, చెవిరెడ్డిని విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించనుంది. అరెస్ట్‌కు ముందు విచారిస్తారా? లేక నేరుగా అరెస్ట్ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.
లిక్కర్ కేసులో చెవిరెడ్డిపై మనీ లాండరింగ్ ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. వేల కోట్ల రూపాయలు చేతులు మారిన ఈ కుంభకోణంలో, కెసిరెడ్డి నుంచి చెవిరెడ్డికి భారీ మొత్తంలో ముడుపులు వచ్చినట్లు సిట్ గుర్తించింది. ఈ నగదును ఎన్నికల సమయంలో పంచినట్లు ఆధారాలు సేకరించారు. ఎన్నికల్లో దొరికిన రూ.8 కోట్లు తనవి కావని, లెక్కలున్నాయని చెవిరెడ్డి వాదించినా, పోలీసులను బెదిరించడం సహా ఆయనపై లెక్కలేనన్ని కేసులు నమోదయ్యాయి. కేసులో కీలక వ్యక్తుల నుంచి సమాచారం బయటకు రాగానే, తేలు కుట్టిన దొంగలా చెవిరెడ్డి ప్రెస్ మీట్‌లు పెట్టి తనపై కుట్రలు జరుగుతున్నాయంటూ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయినా, తాజా పరిణామాలు చెవిరెడ్డిన బయపెట్టినట్టున్నాయి. ఈ క్రమంలో విదేశాలకు పారిపోతూ.. లుకౌట్ నోటీసుల కారణంగా బెంగళూరు ఎయిర్‌పోర్టులో అడ్డగింపబడి.. అంతిమంగా సిట్ వలకు చిక్కినట్లు స్పష్టమౌతోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
Also Read: Liqueur case big update: సిద్ధార్థ్ లూథ్రా వాదనలతో ప్యాంటు తడిచింది..!!
Chevireddy: ఈ కేసులో చెవిరెడ్డి గన్‌మెన్ మదన్‌రెడ్డి వ్యవహారం మరో డ్రామాను తలపిస్తోంది! ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అయిన మదన్ రెడ్డి, సిట్ విచారణలో తనపై దాడి జరిగిందని, నిర్బంధించి కొట్టారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. సిట్ అధికారులు తనను ఒత్తిడి చేసి, తాము చెప్పినట్లు స్టేట్‌మెంట్ ఇవ్వమన్నారని ఆరోపించాడు. ఏకంగా తన ప్రాణాలకే ముప్పుందని, తనకు రక్షణ కల్పించాలని, న్యాయవాది సమక్షంలో విచారణ జరగాలని కోరాడు మదన్‌రెడ్డి. అయితే, సిట్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. మదన్ విచారణకు సహకరించకుండా, తమ అధికారులనే బెదిరించాడని, “మీ పేరు రాసిపెట్టి చనిపోతాను” అంటూ హడావుడి చేశాడని సిట్ తెలిపింది. మదన్ ఆస్పత్రి ఫోటోలు వైరల్ చేసి, కొన్ని ఛానెళ్లు ఈ డ్రామాకు హైప్ క్రియేట్ చేశాయని ఆరోపించింది సిట్. లిక్కర్ స్కామ్‌ను పారదర్శకంగా విచారిస్తున్నామని, 200 మందికి నోటీసులిచ్చి విచారించామని సిట్ తన ప్రకటనలో తెలిపింది. చెవిరెడ్డి అనుచరుడు బాలాజీని నిర్బంధించామన్న ఆరోపణలను కూడా అబద్ధమని ఖండించింది.
చెవిరెడ్డి తన కుట్రలతో సిట్ విచారణను బలహీనపరచాలని చూస్తున్నాడని, ఎంతటి దోషులైనా చట్టం ముందు నిలబెడతామని సిట్ హెచ్చరించింది. మదన్ రెడ్డి పదేళ్లపాటు చెవిరెడ్డి ఆదేశాల మేరకు పనిచేశాడని, ఈ డ్రామాల వెనుక చెవిరెడ్డి పాత్ర స్పష్టమని, ఆధారాలు సైతం సేకరించామని పేర్కొంది. చెవిరెడ్డి పారిపోయే ప్రయత్నం విఫలమైన నేపథ్యంలో, సిట్ ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు సిద్ధమవుతోంది.

