Arshdeep: భారత యువ పైసల్ అర్ష్ దీప్ సింగ్ గత కొద్ది నెలలుగా అద్భుతమైన ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. గత సంవత్సరం భారత్ t20 ప్రపంచ కప్ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించిన ప్లేయర్లలో ఇతను కూడా ఒకడు. బుమ్రాకి తోడుగా… అలాగే అతను లేని సమయంలో కూడా భారత పేస్ బాధ్యతలను తన భుజాలకు ఎత్తుకునే ఈ ఎడమచేతి వాటి బౌలర్ ప్రస్తుతం ఒక అరుదైన రికార్డు సాధించాడు.
పంజాబ్ పేస్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్ గత కొన్ని సంవత్సరాలుగా టీమిండియా తరఫున మంచి ఫామ్ లో ఉన్నాడు. తాను జట్టులోకి వచ్చినప్పటినుండి అటు కోచింగ్ స్టాఫ్ ను, ఇటు సెలెక్టర్లను అబ్బురపరుస్తూ తనదైన శైలిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున కూడా కీలక ప్రదర్శన ఇచ్చే ఈ పేస్ బౌలర్ ప్రస్తుతం భారత జట్టు తరుపున ఒక గొప్ప రికార్డు సాధించాడు.
ఇది కూడా చదవండి: Neymar: చిక్కుల్లో పడ్డ బ్రెజిల్ ఫుట్ బాల్ స్టార్ నెయ్‌మార్
Arshdeep: నిన్న ఇంగ్లాండ్ తో ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మొదటి టి20 లో అర్ష్ దీప్ ఇంగ్లాండ్ ఓపెనర్లు ఇద్దరినీ పెవిలియన్ బాట పట్టించి ఆ జట్టు తొలి రెండు వికెట్లను తానే తీశాడు. దీంతో భారత క్రికెట్ జట్టు తరఫున అత్యధిక ఇంటర్నేషనల్ టి20 వికెట్లు తీసిన బౌలర్ గా అర్ష్ దీప్ రికార్డు కొల్లగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత సీనియర్ లెగ్ స్పిన్నర్ యూజ్వేంద్ర చాహల్ పేరు పై ఉండేది. చాహల్ 80 మ్యాచ్లలో 96 టీ20 ఇంటర్నేషనల్ వికెట్లు సాధిస్తే… అర్ష్ దీప్ కేవలం నిన్న తన 61వ మ్యాచ్ ఆడుతూ 97 టీ 20 ఇంటర్నేషనల్ వికెట్లు సాధించాడు. అదికూడా భారత తరపున ఒక పేస్ బౌలర్ ఈ ఘనత సాధించడం అనేది మామూలు విషయం కాదు.
ఇక తర్వాత స్థానాల్లో హార్దిక్ పాండ్యా, బుమ్రా ఉన్నారు. చాహల్ తో పోలిస్తే ఎంతో తక్కువ మ్యాచ్లలో అర్ష్ దీప్ అతని రికార్డును అధిగమించడం అనేది మామూలు విషయం కాదు. ఇక రాబోయే ఐపీఎల్ లో అర్ష్ దీప్ పంజాబ్ కింగ్స్ తరఫున ఉన్నాడు. వేలంలో అతనిని మళ్లీ భారీ మొత్తానికి పంజాబ్ రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో సిరాజ్ స్థానం కోల్పోయినా.. అర్ష్ దీప్ మాత్రం వన్డే జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. అయితే కొత్త బంతితో ఎంతో చక్కగా ప్రదర్శించే అర్ష్ దీప్ పాత బంతితో కూడా అదే రకమైన ప్రదర్శన ఇవ్వగలడా లేదా అన్నది రాబోయే ఇంగ్లాండ్ వన్డే సిరీస్ తో, ఛాంపియన్స్ ట్రోఫీతో తెలిసిపోతుంది. అతను పాత బంతితో కూడా మంచి ప్రదర్శన ఇస్తే రాబోయే కాలంలో భారత్ ఆధారపడదగ్గ, గర్వించదగ్గ పేసర్ గా ఎదుగుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.