APSRTC: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ప్రయాణించే ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని, ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 9 నుండి జనవరి 13 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు మొత్తం 2,400 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది. పండుగ సందర్భంగా ప్రజలపై ఖర్చుల భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయానికి కారణమని అధికారులు తెలిపారు.
చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, ఒంగోలు, మాచర్లతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే సాధారణ బస్సులు, ప్రత్యేక బస్సులు హైదరాబాద్ నగరంలోని ఎంజీబీఎస్‌కు ఎదురుగా ఉన్న సీబీఎస్ (కేంద్ర బస్ స్టేషన్) నుంచి బయలుదేరతాయని వెల్లడించారు.
ప్రయాణికులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.