APSRTC: ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందించే దిశగా వినూత్న సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆన్లైన్లో లేదా ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులను నేరుగా వారి ఇంటి వద్ద నుంచే బస్టాండ్‌కు చేర్చేందుకు ప్రత్యేక బస్సు పికప్ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు ఎన్టీఆర్ జిల్లా ప్రజా రవాణాధికారిణి (DPTO) వి. నీలిమ ప్రకటించారు. ప్రస్తుతానికి విజయవాడ నగర పరిధిలో విజయవాడ – హైదరాబాద్ మార్గంలో ఈ సదుపాయాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.
ఇంటి వద్దకే బస్సు – నిబంధనలు & బుకింగ్ వివరాలు..
ఒకే లొకేషన్ నుంచి ప్రయాణించే వారి సంఖ్య కనీసం 6 గురు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఇప్పటికే టికెట్లు రిజర్వ్ చేసుకున్న వారితో పాటు, కొత్తగా బుక్ చేసుకునే వారు కూడా ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ప్రయాణికుల ఇంటి వద్ద నుంచి వారు చేరుకోవాల్సిన బస్టాండ్‌కు ఎంత దూరం ఉంటుందో, ఆ దూరానికి తగ్గట్టుగా సాధారణ సిటీ బస్సు టికెట్ రుసుమును అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
బుకింగ్ సమయం & ఫోన్ నంబర్లు..
బస్సు బయలుదేరే సమయానికి కనీసం 4 గంటల ముందుగానే సమాచారం ఇవ్వాలి. ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల మధ్య 73828 25450, 99592 25450 నంబర్లలో సంప్రదించి ఈ పికప్ సదుపాయాన్ని బుక్ చేసుకోవచ్చు.
ఏపీ హైకోర్టు బస్సు రూట్లలో మార్పులు – అదనపు ట్రిప్పులు..
విజయవాడ నుంచి అమరావతిలోని ఏపీ హైకోర్టుకు వెళ్లే ప్రయాణికులు, ఉద్యోగుల సౌకర్యార్థం ఆర్టీసీ మార్గాల్లో కీలక మార్పులు చేసింది:
-
పీఎన్బీఎస్ టు హైకోర్టు: విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (PNBS) నుంచి ఉదయం 9:10 గంటలకు బయలుదేరే బస్సు ఇకపై సీడ్ యాక్సిస్ రోడ్, సీఆర్డీఏ (CRDA) మీదుగా హైకోర్టుకు చేరుకుంటుంది.
-
ఉండవల్లి సెంటర్ నుంచి అదనపు సర్వీస్: ఉదయం 9:25 గంటలకు ఉండవల్లి సెంటర్ నుంచి పెనుమాక, మందడం మీదుగా హైకోర్టుకు వెళ్లేలా సరికొత్త అదనపు ట్రిప్‌ను ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది.
