AP News: కూటమి ప్రభుత్వం తన ఎన్నికల హామీలలో ఒకటైన ‘సూపర్ సిక్స్’లో భాగంగా ‘తల్లికి వందనం’ పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జీవో ఎంఎస్ నెంబర్ 27ను జారీ చేశారు. గురువారం నుంచే అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ కావడం ప్రారంభమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 42,69,459 మంది తల్లుల ఖాతాల్లో 67,27,164 మంది విద్యార్థుల కోసం రూ.15,000 చొప్పున నిధులు జమ చేయనున్నారు. ఈ మొత్తంలో, రూ.2,000 జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉండే ఖాతాలకు మళ్లించి, పాఠశాలల నిర్వహణ, అభివృద్ధి, పారిశుద్ధ్య కార్యక్రమాలకు వినియోగించాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. మిగిలిన రూ.13,000 నేరుగా తల్లుల ఖాతాల్లో జమ అవుతాయి. ఈ పథకం కింద మొత్తం రూ.8,745 కోట్లను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఈ పథకంపై సమీక్ష నిర్వహించారు. అర్హులైన విద్యార్థుల తల్లులందరికీ నిధులు అందేలా చూడాలని ఆదేశించారు. పథకానికి నిధుల కొరత లేకుండా చూసుకోవాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు సూచించారు. ఇప్పటికే గుర్తించిన విద్యార్థులతో పాటు, ఒకటో తరగతిలో, ఇంటర్ ఫస్టియర్‌లో కొత్తగా ప్రవేశం పొందిన విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని సీఎం స్పష్టం చేశారు. అడ్మిషన్లు పూర్తయి డేటా అందుబాటులోకి వచ్చిన వెంటనే వారికి కూడా నిధులు జమ అవుతాయని తెలిపారు.
Also Read: Anagani Satya Prasad: లోకేష్‌కు, చంద్రబాబుకు వ్యత్యాసం చెప్పిన అనగాని..
AP News: ఈ పథకం అమలులో ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా సంబంధిత శాఖలన్నీ సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల ఏ విద్యార్థి పేరు అయినా జాబితాలో లేకపోతే, దరఖాస్తుకు అవకాశం కల్పించి వారికి కూడా నిధులు విడుదల చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
గతంలో వైసీపీ ప్రభుత్వం 2023లో చివరిసారిగా ‘అమ్మ ఒడి’ పథకాన్ని అమలు చేసింది. అప్పట్లో 42,61,965 మంది తల్లులకు సంబంధించి 83,15,341 మంది విద్యార్థుల కోసం రూ.6,392.94 కోట్లు విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ‘సూపర్ సిక్స్’ హామీలలో భాగంగా పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. ఇప్పుడు ‘తల్లికి వందనం’ పథకం అమలుతో మరో కీలక హామీని నెరవేర్చినట్లయింది. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ ఈ పథకం వర్తిస్తుందని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

