AP EAPCET Counselling 2025: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 7వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఈఏపీసెట్ కన్వీనర్ గణేష్ కుమార్ శుక్రవారం వెల్లడించారు.
షెడ్యూల్ వివరాలు:
రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: జులై 7 నుండి 16వ తేదీ వరకు.
వెబ్ ఆప్షన్ల నమోదు: జులై 10 నుండి 18వ తేదీ వరకు.
వెబ్ ఆప్షన్ల మార్పు: జులై 19వ తేదీ.
సీట్ల కేటాయింపు జాబితా విడుదల: జులై 22వ తేదీ.
కళాశాలల్లో రిపోర్టింగ్: జులై 23 నుండి 26వ తేదీ వరకు.
తరగతుల ప్రారంభం: ఆగస్టు 4వ తేదీ.
షెడ్యూల్‌లో మార్పులకు కారణం:
వాస్తవానికి, కౌన్సెలింగ్‌ను జులై 17 నుండి ప్రారంభించాలని ముందుగా ప్రకటించినప్పటికీ, తెలంగాణలో ఇప్పటికే కౌన్సెలింగ్ మొదలైనందున, అక్కడి షెడ్యూల్‌తో పాటే ఏపీలో కూడా కౌన్సెలింగ్ పూర్తి చేసేందుకు ఈ తేదీల్లో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సవరించిన షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి కౌన్సెలింగ్ ప్రకటనను జులై 5న విడుదల చేయనున్నారు.
ఈ ఏడాది జరిగిన ఈఏపీసెట్ 2025 ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలో 1,89,748 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరందరికీ ఈ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు కేటాయించనున్నారు. కౌన్సెలింగ్ మొత్తం మూడు విడతల్లో జరగనుంది.
Also Read: CM Chandrababu: సీఎం చంద్రబాబుతో రెవెన్యూ శాఖ సమీక్ష.. ప్రజల భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి!
సీయూఈటీ యూజీ 2025 ర్యాంకు కార్డులు విడుదల:
ఇదిలా ఉండగా, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) యూజీ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. మే 13 నుండి జూన్ 4వ తేదీ వరకు జరిగిన ఆన్‌లైన్ రాత పరీక్షలకు మొత్తం 13,54,699 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 10,71,735 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థులు తమ ర్యాంకు కార్డులను ఎన్‌టీఏ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.