Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనలోని నిఖార్సైన మానవత్వాన్ని, అభిమానుల పట్ల తనకుండే అమితమైన ప్రేమాభిమానాలను మరోసారి నిరూపించుకున్నారు. ఒక అరుదైన, ప్రాణాంతక జన్యుసంబంధిత వ్యాధితో మంచానికే పరిమితమై, చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన 17 ఏళ్ల వీరాభిమాని చివరి కోరికను తీర్చడానికి ఆయన ఓరుగల్లు గడ్డపై అడుగుపెట్టారు. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో అధికారిక కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. హన్మకొండలోని ఆ బాలుడి ఇంటికి నేరుగా వెళ్లి పరామర్శించడం స్థానికంగా అందరినీ కలచివేసింది.
మృత్యువుతో పోరాడుతున్న ‘చోటా గబ్బర్ సింగ్’:
హన్మకొండలోని హనుమాన్ నగర్ కాలనీకి చెందిన రాము – మానస దంపతుల కుమారుడు నిరంజన్ (17) గత మూడేళ్లుగా “డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ” (Duchenne Muscular Dystrophy) అనే అత్యంత అరుదైన, ప్రాణాంతక జన్యుపరమైన నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి వల్ల కండరాలు పూర్తిగా క్షీణించి, 17 ఏళ్ల వయసులో కనీసం లేవలేని స్థితిలో, మంచానికే పరిమితమై నరకం అనుభవిస్తున్నాడు. ఆ జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియని స్థితిలో ఉన్నా.. నిత్యం పవన్ కళ్యాణ్ జపం చేస్తూ, స్థానికంగా ‘చోటా గబ్బర్ సింగ్’ అని పేరు తెచ్చుకున్న ఆ బాలుడికి, పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారి చూడాలనేదే ఏకైక ఆశగా మిగిలింది.
రంగంలోకి జనసేనాని – నిరంజన్ ఇంట 45 నిమిషాల సందడి:
ఈ ‘చోటా గబ్బర్ సింగ్’ దీనగాథ సామాజిక కార్యకర్త చిలువేరు శంకర్, స్థానిక జనసేన నాయకుల ద్వారా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది. విషయం తెలిసిన వెంటనే స్పందించిన జనసేనాని.. హన్మకొండలోని నిరంజన్ నివాసానికి స్వయంగా వచ్చారు.
-
ఆప్యాయమైన పలకరింపు: నిరంజన్ ఇంటికి వచ్చిన పవన్ కళ్యాణ్.. నేరుగా ఆ బాబు మంచం పక్కనే కూర్చున్నారు. కొంత సేపు గడుపుతూ, ఎంతో ఆప్యాయంగా పలకరించి ధైర్యం చెప్పారు.
-
కుటుంబానికి కొండంత అండ: కళ్లల్లో నీళ్లతో తల్లడిల్లిపోతున్న ఆ తల్లిదండ్రులకు తానున్నానంటూ కొండంత అండగా నిలిచారు. పవన్ కళ్యాణ్‌ను అంత దగ్గరగా చూడటంతో నిరంజన్ కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆ కుటుంబానికి పవన్ రాక ఒక అరుదైన ఔషధంగా, ఆయుస్సును నింపే ‘సంజీవిని’ లా అనిపించింది.
కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు:
“మా బిడ్డ గాలిబుడగ లాంటి జీవితంతో పోరాడుతున్నాడు. చనిపోయేలోపు పవన్ కళ్యాణ్‌ను చూడాలనే వాడి చివరి కోరికను ఆయన స్వయంగా మా ఇంటికి వచ్చి తీర్చారు. మా పలకరింపే వాడికి పెద్ద ఆయుష్షు” అంటూ నిరంజన్ తల్లిదండ్రులు రాము-మానస కన్నీటి పర్యంతమవుతూ పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ బిజీ షెడ్యూల్‌లోనూ ఒక సామాన్య అభిమాని ఇంటికి వచ్చి పవన్ చూపిన ఈ గొప్ప మనసు ఓరుగల్లు ప్రజల హృదయాలను గెలుచుకుంది.
