Amaravati: ఆంధ్రప్రదేశ్‌ను సముద్ర వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కీలక ఒప్పందం

Amaravati: ఆంధ్రప్రదేశ్‌ను దేశ తూర్పు తీరానికి ప్రధాన మారిటైమ్ గేట్‌వే, లాజిస్టిక్స్ హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ముందడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాత ఏ.పీ. మోలర్-మాయర్స్క్ గ్రూప్‌లో భాగమైన ఏపీఎం టెర్మినల్స్ (ఏపీఎంటీ) సంస్థతో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ (ఏపీఎంబీ) ఒక కీలక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో పోర్టులు, టెర్మినళ్ల అభివృద్ధి, ఆధునికీకరణ మరింత వేగవంతం కానున్నట్లు వెల్లడించారు.

రూ.9,000 కోట్ల భారీ పెట్టుబడి

ఈ భాగస్వామ్యంలో భాగంగా ఏపీఎం టెర్మినల్స్ రాష్ట్రంలో రూ.9,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది. దీని ద్వారా:

పోర్టులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునికీకరించటం

ప్రపంచస్థాయి టెర్మినళ్ల నిర్మాణ

పారిశ్రామిక ప్రగతికి తోడు, సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దోహదం చేయటం జరుగుతుందని తెలిపారు.

ఉపాధి అవకాశాలు

ఈ పెట్టుబడితో రాష్ట్రంలో 10,000 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం అంచనా వేసింది.

వ్యూహాత్మక మైలురాయి

ఏపీఎం టెర్మినల్స్‌కు ఉన్న అంతర్జాతీయ అనుభవం, ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక భౌగోళిక స్థానం కలగలసి, రాష్ట్రాన్ని సముద్ర వాణిజ్య రంగంలో ఒక ప్రపంచస్థాయి మైలురాయిగా నిలబెడుతుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

“ఆంధ్రప్రదేశ్‌ను తూర్పు తీరానికి ప్రధాన మారిటైమ్ గేట్‌వే, లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఈ ఒప్పందం ఆ దిశగా వేసిన బలమైన అడుగు” అని ఆయన స్పష్టం చేశారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *